బెంగళూరు, డిసెంబర్ 14: విమాన ప్రయాణంలో ఉండగా, తీవ్ర అస్వస్థతకు గురైన తోటి ప్రయాణికురాలిని వృత్తిరీత్యా డాక్టర్ అయిన మాజీ ఎమ్మెల్యే కాపాడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే అయిన అంజలీ నంబల్కర్ గోవా-న్యూఢిల్లీ విమానంలో వెళ్తున్నారు. అయితే హఠాత్తుగా అమెరికాకు చెందిన తోటి ప్రయాణికురాలు తనకు అస్వస్థతగా ఉందని, వణుకు వస్తోందని చెప్పి స్పృహ కోల్పోయారు. ఆమె నాడి కూడా కొట్టుకోవడం ఆగిపోయింది.
దీంతో అప్రమత్తురాలైన అంజలి ఆమెకు సీపీఆర్ చేసి బతికించారు. తర్వాత ఆమె పక్కనే ఉండి ఆరోగ్యాన్ని పర్యవేక్షించారు. విమానం ఢిల్లీలో ల్యాండ్ అయిన వెంటనే ఆ ప్రయాణికురాలిని అంబులెన్స్‌లో దవాఖానకు తరలించారు. అత్యవసర సమయంలో తక్షణం స్పందించి తోటి ప్రయాణికురాలి ప్రాణాలు కాపాడిన డాక్టర్ అంజలీని పలువురు ప్రశంసించారు.