ముంబై: విమానం గాలిలో ఎగురుతుండగా మహిళా ప్రయాణికురాలు అస్వస్థతకు గురైంది. దీంతో అత్యవసర వైద్యం కోసం ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అయితే ఆ మహిళ అప్పటికే విమానంలో మరణించినట్లు గుర్తించారు. (Woman dies in Plane) మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఈ సంఘటన జరిగింది. ఆదివారం రాత్రి ఇండిగో విమానం ముంబై నుంచి వారణాసికి బయలులేరింది. అయితే ఆ విమానంలో ప్రయాణించిన 89 ఏళ్ల వృద్ధురాలు అస్వస్థతకు గురైంది.
కాగా, ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో ఆదివారం రాత్రి పది గంటల సమయంలో ఛత్రపతి శంభాజీనగర్‌లోని చికల్తానా విమానాశ్రయంలో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అందులో ఉన్న వృద్ధురాలిని వైద్య బృందం పరిశీలించింది. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
మరోవైపు మృతురాలిని ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌కు చెందిన సుశీలా దేవిగా గుర్తించారు. పోలీసుల లాంఛనాల తర్వాత ఆమె మృతదేహాన్ని ఛత్రపతి శంభ్జీనగర్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం ఆ విమానం అక్కడి నుంచి వారణాసికి బయలులేరిందని ఇండిగో సంస్థ అధికారి తెలిపారు.