ముంబై: భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో ఒక మహిళ పడింది. డ్రైనేజీలో కొట్టుకుపోయి మరణించింది. కుటుంబానికి ఆధారమైన ఆ మహిళ మృతిపై ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు సంబంధిత కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేశారు. (FIR Against Civic Body) మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. బుధవారం నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో వర్షం నీటితో డ్రైనేజీలు పొంగిపొర్లాయి.
కాగా, బుధవారం రాత్రి అంధేరీ ఈస్ట్‌లోని మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భవనంలోని గేట్ నంబర్ 8 సమీపంలో పొంగిపొర్లుతున్న మ్యాన్‌హోల్‌లో ఒక మహిళ పడిపోయింది. డ్రైనేజీలో కొట్టుకుపోయిన ఆమెను పోలీసులు, ఫైర్ సిబ్బంది వెలికి తీశారు. హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతురాలిని 45 ఏళ్ల విమలా అనిల్ గైక్వాడ్‌గా గుర్తించారు.
మరోవైపు విమలా మరణంపై ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను అనారోగ్యంతో ఉండటంతో ఉద్యోగం చేస్తున్న భార్య కుటుంబాన్ని పోషిస్తున్నదని, తమకు ఆమె ఆధారమని తెలిపాడు. భార్య అకాల మృతితో తమ కుటుంబం సర్వం కోల్పోయిందని వాపోయాడు. మ్యాన్‌హోల్ తెరిచి నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశాడు.
కాగా, ముంబై పోలీసులు ఈ సంఘటనపై స్పందించారు. మహిళ భర్త ఫిర్యాదు ఆధారంగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ), సంబంధిత కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేశారు. అలాగే నిర్లక్ష్యపు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఎంసీ కూడా ఈ సంఘటనపై స్పందించింది. డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సంఘటనపై మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆ కమిటీని కోరింది. ఆ రిపోర్ట్ ఆధారంగా బాధ్యులైన వారిపై చర్యలు చేపడతామని పేర్కొంది.