ముంబై: పని చేస్తున్న కంపెనీ మేనేజర్ పుట్టిన రోజు పార్టీ ఏర్పాట్లలో ఒక మహిళ బిజీ అయ్యింది. అయితే ప్రమాదవశాత్తు బిల్డింగ్ 11వ అంతస్తు నుంచి కింది ఫ్లోర్లో ఆమె పడింది. తలకు తీవ్ర గాయం కావడంతో మరణించింది. (Woman Dies After Falling) మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. పోవై హిరానందని గార్డెన్స్‌లోని సుప్రీం బిజినెస్ పార్క్‌లో ఉన్న ఒక కంపెనీలో 27 ఏళ్ల జినాల్ వోరా పని చేస్తున్నది. జనవరి 9న ఆ సంస్థ మేనేజర్ బర్త్ డే పార్టీ కోసం సిబ్బంది ఏర్పాట్లు చేశారు.
కాగా, ఆ రాత్రి 8 గంటల సమయంలో బాస్ బర్త్ డే ఎరెంజ్మెంట్స్ చేస్తున్న జినాల్ విరామం తీసుకున్నది. ఆ భవనం 11వ అంతస్తులోని ఎమర్జెన్సీ విండో వద్ద కాఫీ తాగుతుండగా ఆమె అదుపుతప్పింది. ఎమర్జెనీ విండో నుంచి పదో అంతస్తులో పడింది. తలకు తీవ్రగాయమైన ఆ మహిళను వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. బాంబే హైకోర్టులో న్యాయవాది అయిన ఆమె భర్త సిద్ధార్థ్‌కు ఈ సమాచారం ఇచ్చారు. ప్రమాదవశాత్తు జరిగిన ఈ సంఘటనపై ఎలాంటి అనుమానాలు లేవని, ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు వెల్లడించారు.