పాట్నా: భూ వివాదాన్ని పరిష్కరించేందుకు సిబ్బందితో కలిసి వెళ్లిన పోలీస్ అధికారిణికి ఊహించని సంఘటన ఎదురైంది. ఆక్రమణదారులు బాణాలతో దాడి చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారిణి తలలోకి బాణం దిగింది. (Woman Cop Shot With Arrow) ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. బీహార్‌లోని అరారియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో జోకిహాట్ బ్లాక్‌లోని పోఖారియా గ్రామంలో భూప్ నారాయణ్ యాదవ్‌కు చెందిన స్థలాన్ని ఆక్రమించేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. సుమారు 200 మంది జనం అక్కడకు చేరుకుని వెదురు కర్రలు పాతారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న మహల్గావ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆక్రమణదారులు విల్లులు, బాణాలతో పోలీసులపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో సబ్ ఇన్స్పెక్టర్ నుస్రత్ పర్వీన్ తలలోకి ఒక బాణం దిగింది. ఆమెను వెంటనే పూర్నియాలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ మహిళా ఎస్ఐ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. అదనపు పోలీసులను అక్కడకు పంపి పరిస్థితిని నియంత్రించినట్లు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.