లక్నో: కుళ్లిన స్థితిలో నీటిలో పడి ఉన్న మృతదేహాన్ని (Dead body) మహిళదిగా పోలీసులు భావించారు. అయితే పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆ మృతదేహం పురుషుడిదిగా తేలింది. ఈ నేపథ్యంలో ఎలా పొరపాటు పడ్డారో తెలియక పోలీసులు షాక్ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గోనె సంచి మూటలో ఉన్న మృతదేహం నీటిపై తేలుతూ బాగా దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు.
కాగా, చేతులు, కాళ్లు కట్టేసి గోనె సంచిలో కుక్కిన మృతదేహం బాగా కుళ్లిపోయి, గుర్తించని స్థితిలో ఉండటాన్ని పోలీసులు గమనించారు. పొడవైన జట్టు, ఎరుపు రంగు కుర్తా, తెల్లని పైజామా దుస్తులు ఉండటంతో మహిళ మృతదేహంగా పోలీసులు భావించారు. పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతదేహాన్ని పరిశీలించిన డాక్టర్లు అది పురుషుడిదిగా తేల్చారు. అయితే పోలీస్ రిపోర్ట్‌లో మహిళ మృతదేహంగా పేర్కొనడంతో దానిని మార్చే వరకు పోస్ట్‌మార్టం చేసేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆ మృతదేహాన్ని మూడు రోజుల పాటు మార్చురీలో ఉంచారు.
మరోవైపు పొడవైన జుట్టు ఉన్న ఆ మృతదేహం పూజారిది అయ్యి ఉంటుందని పోలీసులు తాజాగా భావిస్తున్నారు. గొంతు చుట్టు తాడు బిగించి ఉండటంతో గొంతు నులిమి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ హత్యతోపాటు మహిళ మృతదేహంగా పొరపడటంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.