న్యూఢిల్లీ : ఓ వ్యక్తి షేరింగ్ ఆటోలో వెళ్తూ.. స్మోకింగ్ చేశాడు. ఆటోలో సిగరెట్ తాగొద్దని, దాన్ని లాగేసిన ఓ మహిళపై ఆ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన గురుగ్రామ్‌లో సోమవారం సాయంత్రం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
ఢిల్లీలోని వజిరాబాద్కు చెందిన సుమన్ లతా అనే మహిళ.. గురుగ్రామ్‌లోని ఓ ఆస్పత్రిలో పని చేస్తోంది. అయితే ఆమె షేరింగ్ ఆటోలో ప్రయాణిస్తుండగా.. మధ్యలో ఓ వ్యక్తి ఎక్కాడు. ఆటోలోనే అతను సిగరెట్ కాల్చాడు. సిగరెట్ కాల్చొద్దని లతా అతనికి చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. మళ్లీ చెప్పింది. దీంతో ఆగ్రహంతో అసభ్య పదజాలంతో దూషించాడు. మళ్లీ ఆమె అతని నోట్లో నుంచి సిగరెట్‌ను లాగేసింది. ఇక ఆమె ముఖంపై బలంగా కొట్టాడు.
లతా ముక్కులో నుంచి రక్తం కారడంతో ఆమె పోలీసులకు సమాచారం అందించింది. ఆటో వద్దకు చేరుకున్న పోలీసులు సిగరెట్ కాల్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఫరిదాబాద్‌కు చెందిన వాసు సింగ్.. ఓ ప్రయివేటు బ్యాంకులో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.