మీరట్: ఆమె ముగ్గురు పిల్లల తల్లి. భర్తతో ఉంటూనే మరొకరితో వివాహేతర సంబంధం (Extramarital Affair) కొనసాగిస్తున్నది. విషయం కాస్తా భర్తకు తెలిసింది. గ్రహించిన ఆమె అడ్డు తొలగించుకోవాలనుకుంది. భర్తను చంపేయాలని ప్రియుడికి చెప్పింది. దీంతో అతడిని తుపాకీతో కాల్చి పొలంలో పడేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో జరుగింది.
అగ్వాన్పూర్ గ్రామానికి చెందిన అంజలి, రాహుల్ భార్యభర్తలు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే ఆమె అదే గ్రామానికి చెందిన అజయ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నది. ఈ క్రమంలో విషయం భర్తకు తెలిసింది. అతడు ఎక్కడ రచ్చ చేస్తాడని అనుకుందో ఏమో.. రాహుల్‌ను అంతమొందించాలని అనుకుంది. ప్రియుడితో కలిసి అతని హత్యకు ప్లాన్ చేసింది.
ఇందులో భాగంగా ఊరి చివరన ఉన్న పొలంలో కలుద్దామని రాహుల్‌కు అజయ్ చెప్పాడు. దీంతో ఒంటరిగా పొలం వద్దకు వెళ్లిన రాహుల్‌ను తుపాకీతో కాల్చి చంపేశాడు. అతనిపై మూడుసార్లు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతని ఒంటిపై మూడు బుల్లెట్ గాయాలు ఉండటాన్ని గమనించిన పోలీసులు.. ఈ హత్యకు తొలుత దొంగతనమే కారణమని భావించారు. కానీ విచారణలో భాగంగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
దర్యాప్తులో భాగంగా అంజలిని ప్రశ్నించాలనుకున్న పోలీసులు.. అగ్వాన్పూర్ వెళ్లారు. అయితే అప్పటికే ఆమె ఇంటి నుంచి పరారైనట్లు తేలింది. అయితే అదే గ్రామానికి చెందిన అజయ్‌తో అంజలికి వివాహేతర సంబంధం ఉందని కనుగొన్నారు. దీంతో పోలీసులు అతడిని విచారించేందుకు ప్రయత్నించగా, అజయ్ కూడా ఇంట్లో లేడని తెలిసింది. ఇద్దరూ అజ్ఞాతంలో ఉన్నట్లు గుర్తించి.. వారికోసం గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు ఇద్దరిని అదుపులోనికి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా అజయ్ నిజం వెల్లడించాడు. అంజలి భర్త రాహుల్ తమ సంబంధం గురించి తెలుసుకున్నాడని, దీంతో అంజలి కలత చెందిందని, తరువాత ఆమె భర్తను చంపేందుకు ఒక ప్లాన్ చేసిందని చెప్పాడు. ఇందులో భాగంగానే రాహుల్‌ను పొలాల దగ్గర కలుసుకుందామని తానే చెప్పానని, వచ్చిన తర్వాత అతనిపై మూడుసార్లు తుపాకీతో కాల్పులు జరిపానని వెల్లడించాడు. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నది.