Mother and son died : తల్లీకొడుకు ఇద్దరూ ప్రమాదవశాత్తు భవనం 13వ అంతస్తు నుంచి కిందపడి దుర్మరణం పాలయ్యారు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని గౌతమ్‌బుద్ధ నగర్ (Gautham Budda Nagar) లో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గౌతమ్‌బుద్ధ నగర్‌లోని బిస్రక్ పోలీస్‌స్టేషన్ పరిధిలోగల ఓ బహుళ అంతస్తుల భవనం 13వ అంతస్తులో దర్పన్ చావ్లా అనే వ్యక్తి తన భార్య, కుమారుడితో కలిసి నివాసం ఉంటున్నాడు.
దర్పన్ చావ్లా కుమారుడైన 12 ఏళ్ల దక్ష్కు మతిస్థిమితం లేదు. దాంతో తల్లి అతడిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో శనివారం ఉదయం దక్ష్ బిల్డింగ్ పైనుంచి దూకేస్తానని తల్లికి చెప్పి వేగంగా పరుగుతీశాడు. ఆ హఠాత్పరిణామాన్ని ఊహించని తల్లి కొడుకును కాపాడుకునేందుకు అంతే వేగంగా వెంటపడింది. దక్ష్‌ను అందుకునే ప్రయత్నంలో అతడితోపాటు కిందపడింది.
ఈ ఘటనలో తల్లీకొడుకు ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు. ఆ సమయంలో దర్పన్ చావ్లా మరో గదిలో ఉన్నాడు. అలికిడి బయటికి పరుగుతీసిన అతడికి భార్య, కుమారుడు ఇద్దరూ విగతజీవులై కనిపించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి మృతదేహాలను పోస్టుమార్టానికి పంపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.