జైపూర్: వీర మరణం పొందిన జవాన్ల భార్యలకు అన్యాయం జరిగింది. ఉద్యోగాల కోసం వారు కన్నీళ్లు కారుస్తూ ధర్నా చేయాల్సిన దుస్థితి కలిగింది. జైపూర్లోని అమర వీరుల స్మారకం వద్ద ఇటీవల మంజు లాంబా(23), మధుబాల, సుందరి గుర్జర్ ధర్నా నిర్వహించారు. 2019లో జరిగిన పుల్వామా దాడిలో వీరి భర్తలు వీర మరణం పొందారు. రాజస్థాన్ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో వీరు ధర్నా చేయాల్సి వచ్చింది. ‘నా భర్త దేశం కోసం చేసిన త్యాగాన్ని మంత్రులు, మీడియా కీర్తిస్తుంటే నా పిల్లల్ని కూడా సైన్యంలో చేర్చాలనుకున్నాను. కానీ ఇవాళ మాకు ఎవరూ తోడుగా లేరు.
ప్రభుత్వం మా విజ్ఞప్తులు పట్టించుకోవడంలేదు. మా ఆవేదన విననప్పుడు వారు మమ్మల్ని వీరాంగణలని ఎందుకు పిలవాలి’ అని మంజు లాంబా ఆవేదన వ్యక్తం చేశారు. తన మరిదికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, స్వగ్రామంలో తన భర్త పేరున స్మారకం నిర్మిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం వాటిలో దేనినీ నెరవేర్చలేదని ఆమె వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ నెల ఒకటిన రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ మంత్రి రాజేంద్ర సింగ్ గుహ సైనికుల భార్యలతో చర్చించారు. ‘వీరాంగణలు ధర్నా చేయాల్సి రావడం సిగ్గు చేటు. వారికి ఇవ్వాల్సిన భూమి, ఆర్థిక సాయం ఇప్పటికే మంజూరు చేశాం. ఇప్పుడు వాళ్లు ప్రభుత్వ ఉద్యోగం కావాలని అడుగుతున్నారు. అది మా పరిధిలో లేదు. ఈ విషయం గురించి మేం ముఖ్యమంత్రితో మాట్లాడతాం.’ అని గుహ చెప్పారు.