రాంచి: తనకు కేటాయించిన అన్ని భద్రతా వాహనాలను సీఎం హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఉపసంహరించిందని జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ (Champai Soren) విమర్శించారు. తన ప్రాణాలకు ముప్పు కలిగేలా చేశారని ఆరోపించారు. గత నెలలో బీజేపీలో చేరిన చంపై సోరెన్, బుధవారం హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. తనకు కేటాయించిన అన్ని భద్రతా వాహనాలను ఉపసంహరించడం ద్వారా ప్రభుత్వం తన ప్రాణాలను పణంగా పెట్టిందని ఆరోపించారు. తన భద్రతా వాహనాలను వెనక్కి తీసుకోవడం రాజకీయ కుట్ర అని ఆరోపించారు. ‘రాజకీయ కుట్రతో నా ప్రాణాలను పణంగా పెట్టారు. నాకు కేటాయించిన అన్ని భద్రతా వాహనాలను జార్ఖండ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ చర్యకు నేను భయపడను. జార్ఖండ్ ప్రజలే నాకు భద్రత కల్పిస్తారు’ అని మీడియాతో అన్నారు.
కాగా, తన విలువల పట్ల తాను ఎప్పుడూ రాజీ పడలేదని జేఎంఎం మాజీ నాయకుడు చంపై సోరెన్ తెలిపారు. జార్ఖండ్లో రాజకీయ నేతలను బీజేపీ కొనుగోలు చేసిందన్న సీఎం హేమంత్ సోరెన్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ‘నన్ను కొనడానికి ఎవరూ సాహసించరు’ అని అన్నారు. జేఎంఎంలో అవమానాలు, అగౌరవం ఎదుర్కోవడం వల్లనే ఆ పార్టీని వీడి బీజేపీలో చేరినట్లు తెలిపారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం నేతృత్వంలోని కూటమికి ప్రజలు తగిన సమాధానం చెబుతారని అన్నారు.