Voice Phishing | న్యూఢిల్లీ : ప్రజల ఆన్లైన్ భద్రతకు ముప్పు తెచ్చే సైబర్ నేరాలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా విషింగ్ లేదా వాయిస్ ఫిషింగ్ గురించి ఆందోళన వ్యక్తమవుతున్నది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ స్కామ్‌లో ఇంటర్నేషనల్ నంబర్ల నుంచి ఆటోమేటెడ్ వాయిస్ మెసేజ్ వస్తున్నది. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యమైన గమనిక అని హెచ్చరిస్తున్నది. “మీ వ్యక్తిగత వివరాలను డార్క్ వెబ్‌లో నిరంతరం వాడుతున్నారు. మీరు రెండు గంటల్లోగా రిపోర్ట్ చేయకపోతే, మీ మీద చట్టపరమైన చర్య తీసుకుంటాం” అన్నది ఆ హెచ్చరిక సారాంశం. రిపోర్ట్ చేయడం కోసం నంబర్ 9ను నొక్కాలని కోరుతున్నది. ఎవరైనా మోసపోయి నంబర్ 9 నొక్కితే కాల్ స్కామ్ ఆర్టిస్ట్‌కు కనెక్ట్ అవుతుంది. ఆ స్కామ్ ఆర్టిస్ట్ స్పందించి, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు వంటి ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేయాలని లేదా డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తెస్తాడు. ఇదంతా సమస్యను పరిష్కరించడం కోసమే అడుగుతున్నట్లుగా నటిస్తాడు.
అవాంఛనీయ ఫోన్ కాల్స్‌కు స్పందించకూడదు. ప్రభుత్వ శాఖలు సున్నితమైన సమాచారాన్ని ముందుగా రికార్డు చేసిన సందేశాల ద్వారా అడగవు. కాబట్టి ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో ధ్రువీకరించుకోవాలి. ఇంటర్నేషనల్ నంబర్లు, లోకల్ నంబర్ల నుంచి వచ్చే అనుమానాస్పద కాల్స్‌పై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి.