న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వద్ద జరిగే వైమానిక ఉల్లంఘనల విషయంలో భారత ఆర్మీకి చెందిన హాట్లైన్లో చైనాతో కమ్యూనికేట్ చేస్తామని ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరీ తెలిపారు. 90వ వైమానిక దినోత్సవం నేపథ్యంలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. చైనాతో ఏదైనా సమస్య తలెత్తినా లేక వైమానిక ఉల్లంఘనలు జరిగినా.. ఆ సమయంలో భారత సైన్యానికి చెందిన హాట్లైన్లో చైనాతో మాట్లాడుతామని ఎయిర్ చీఫ్ తెలిపారు. వాస్తవాధీన రేఖ వెంట దళాల ఉపసంహరణ జరిగిందని, చైనా వైమానిక దళ కార్యకలాపాలపై నిఘా వేశామని, రేడార్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను పెంచామని చౌదరీ వెల్లడించారు. జూన్లో చైనాకు చెందిన ఓ సైనిక విమానం.. ఎల్ఏసీ వద్ద ఉల్లంఘనకు పాల్పడింది. ఉద్రిక్తత ప్రదేశాల్లో ఆ విమానం చక్కర్లు కొట్టినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఆ ఫైటర్ విమానం ఇండియన్ రేడార్కు చిక్కింది.