Election Commission | న్యూఢిల్లీ, మే 1: సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని అధికారికంగా వెల్లడించడానికి ఎన్నికల కమిషన్ ఎందుకు జాప్యం చేస్తున్నది? పోలింగ్ జరిగిన రోజు చెప్పిన లెక్కకు, చివరి లెక్కకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటానికి కారణమేంటి? అసలు నియోజకవర్గాల వారీగా ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంత మంది ఓటేశారు? అనే వివరాలను ఎందుకు వెల్లడించడం లేదు? ఈ ప్రశ్నలు ఇప్పుడు దేశంలోని ప్రతిపక్ష పార్టీలను, రాజకీయ విశ్లేషకులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మొదటి, రెండో విడత ఎన్నికల ప్రక్రియపై వివిధ పార్టీల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఓటింగ్ శాతాన్ని వెల్లడించడానికి రోజుల తరబడి సమయం ఎందుకు పడుతున్నదని ప్రశ్నిస్తున్నారు. ఓటింగ్ జరిగిన రోజు సాయంత్రం 7 గంటల వరకు పోలైన ఓట్ల లెక్కలకు, తుది ఓట్ల శాతానికి దాదాపు 6 శాతం తేడా ఉండటం అసాధారణంగా చెప్తున్నారు.
పోలింగ్ ముగిసిన 24 గంటల్లోపే ఎన్నికల కమిషన్ తుది పోలింగ్ శాతాన్ని వెల్లడిస్తుంది. ఎక్కువలో ఎక్కువగా పోలింగ్ ముగిసిన 48 గంటల్లోపు అధికారికంగా ఎంత శాతం పోలింగ్ జరిగిందో ఈసీ ప్రకటించేస్తుంది. 2019లో మొదటి విడత ఎన్నికలు ఏప్రిల్ 11న జరిగితే, 13న ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన తుది ఓటింగ్ శాతాన్ని ఈసీ వెల్లడించింది. కానీ, ఈసారి అలా జరగలేదు. సార్వత్రిక ఎన్నికల మొదటి విడత పోలింగ్ ఏప్రిల్ 19న జరిగింది. రెండో విడత ఏప్రిల్ 26న పూర్తయ్యింది. తుది ఓటింగ్ శాతాన్ని ఈసీ ఏప్రిల్ 30న వెల్లడించింది. అంటే, మొదటి విడత పోలింగ్ జరిగిన 11 రోజులకు, రెండో విడత జరిగిన 4 రోజులకు పోలింగ్ శాతాన్ని వెల్లడించింది. ఇలా జాప్యం జరగడం ఇదే మొదటిసారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ పేర్కొన్నారు.
సాధారణంగా సాయంత్రం 7 గంటల నాటికి దాదాపుగా పోలింగ్ పూర్తవుతుంది. అప్పటికి నమోదైన ఓటింగ్ శాతానికి ఒకటి, రెండు శాతానికి మించి తుది పోలింగ్ శాతం ఉండదు. 2019 మొదటి విడతలో పోలింగ్ జరిగిన రోజు 67.11 శాతం నమోదైందని ఈసీ వెల్లడించగా, ఏప్రిల్ 13న 69.43 శాతం నమోదైనట్టు తుది ప్రకటన చేసింది. రెండో దశలో పోలింగ్ జరిగిన ఏప్రిల్ 18 నాడు 66 శాతంగా చెప్పగా, ఏప్రిల్ 19న 67.84 శాతం నమోదైందని అధికారికంగా వెల్లడించింది. అంటే మొదటి, తుది లెక్కకు మధ్య తేడా కేవలం 1 – 2 శాతమే ఉంది. ఇప్పుడు మాత్రం ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరిగినప్పుడు 60 శాతం జరిగిందని ఈసీ వెల్లడించింది. ఏప్రిల్ 30న తుది ప్రకటనలో మాత్రం 66.14 శాతం నమోదైనట్టు వెల్లడించింది. రెండో విడతలోనూ పోలింగ్ జరిగిన ఏప్రిల్ 26 సాయంత్రం 60.96 శాతం జరిగినట్టు ఈసీ వెల్లడించింది. ఏప్రిల్ 30న తుది ప్రకటనలో మాత్రం 66.71 శాతం నమొదైనట్టు పేర్కొన్నది. ఓటింగ్ శాతంలో ఇంత భారీ వ్యత్సాసం ఉండటంపై రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను 35 ఏండ్లుగా ఎన్నికలను అధ్యయనం చేస్తున్నానని, ఓటింగ్ పూర్తైన 24 గంటల్లో తుది డాటా రావాలని ఆయన పేర్కొన్నారు. టీఎంసీ నేత డెరెక్ ఓబ్రెయిన్ సైతం పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రతి విడత పోలింగ్ పూర్తైన తర్వాత ఈసీ ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించలేదని, ఎందుకు పోలింగ్ డాటా వెల్లడించడంలో జాప్యం జరిగిందని ఆయన ప్రశ్నించారు.
లోక్సభ నియోజకవర్గాల వారీగా ఎంత మంది ఓటర్లు ఉన్నారు, ఎంత మంది ఓటు వేశారనే వివరాలను కూడా ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో పొందుపర్చలేదని ప్రతిపక్ష పార్టీల నేతలు లేవనెత్తుతున్నారు. ఓటర్ల అసలు సంఖ్య వెల్లడించకుండా పోలింగ్ శాతం వెల్లడించడం అర్థరహితమని సీపీఎం నేత సీతారాం ఏచూరీ ఆరోపించారు. ఇలాగైతే ఓటు వేసిన వారి సంఖ్య మార్చడం ద్వారా ఫలితాలను తారుమారు చేస్తారనే భయాలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. ఓటర్ల సంఖ్య, పొలైన ఓట్ల సంఖ్యను నియోజకవర్గాల వారీగా వెల్లడించకపోవడాన్ని యోగేంద్ర యాదవ్ లేవనెత్తారు. ఈ వివరాలు లేకుండా పర్సంటేజీలతో ఎన్నికల అసలు లెక్కలు తేలవని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికలు పూర్తి కాగానే ఈసీ ప్రకటించిన పోలింగ్ శాతం కంటే తుది పోలింగ్ శాతం ఒకేసారి దాదాపు 5.75 శాతం పెరిగింది. ఇది ఆందోళనకరం. బీజేపీకి అనుకూలంగా ఎక్కడైతే ఓటింగ్ జరగలేదో అక్కడే పోలింగ్ శాతం పెరిగింది. ఇది అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఈసీ ఈ విషయంపై స్పందించాలి.
లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎంత మంది ఓటర్లు ఉన్నారు, ఎంత మంది ఓటు వేశారు అనే వివరాలను ఈసీ వెల్లడించలేదు. డాటా విడుదలలో అసలు ఉద్దేశమే నీరుగారిపోయింది. ఇందులో ఎలాంటి రాజకీయ ఆటలు ఆడబోరని ఆశిద్దాం.