కోల్కతా: సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) కొత్త చట్టంతో కేంద్ర ప్రభుత్వం తమను నియంత్రించలేదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఇదే విషయాన్ని ప్రధాని మోదీకి చెబుతానని అన్నారు. ప్రధాని మోదీని కలిసేందుకు మమతకు బుధవారం అపాయింట్మెంట్ లభించింది. దీంతో ఆమె సోమవారం ఢిల్లీకి బయలుదేరారు. వెళ్లే ముందు కోల్కతా ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడారు.
బెంగాల్లో బీఎస్ఎఫ్ అధికార పరిధిని 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లకు పెంచిన అంశంతోపాటు త్రిపురలో హింస, బెంగాల్ అభివృద్ధికి సంబంధించిన వాటిపై ప్రధాని మోదీతో చర్చిస్తానని తెలిపారు. ‘మనల్ని నియంత్రించడానికి నేను వారిని (కేంద్రాన్ని) ఎప్పటికీ అనుమతించను. లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర అంశం. బీఎస్ఎఫ్ పట్ల మాకు గౌరవం ఉంది. కానీ మా ప్రాంతాలను నియంత్రించడానికి మేము అనుమతించం. బీజేపీ తన అధికారాన్ని నిలుపుకునేందుకు కేంద్ర ఏజెన్సీలను ఉపయోగిస్తోంది’ అని విమర్శించారు.
త్రిపుర హింస కేవలం ఆ రాష్ట్రానికే పరిమితం కాదని, ముంబై, ఢిల్లీతోపాటు దేశ వ్యాప్తంగా గళమెత్తుతారని మమత తెలిపారు. కాగా, మమతా బెనర్జీ నాలుగు రోజులపాటు ఢిల్లీలో ఉంటారు. 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో పార్టీ ఎంపీలతోపాటు విపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలతో ఆమె సమావేశమవుతారు.