SIR | బీహార్లో సర్ ప్రక్రియ చెల్లుబాటుపై అక్టోబర్ 7న తుది వాదనలు వింటామని సుప్రీంకోర్టు వెల్లడించింది. భారత ఎన్నికల సంఘం బీహార్ సర్ ప్రక్రియలో చట్టం, నియమాలను పాటిస్తుందని తాము విశ్వసిస్తున్నామని ధర్మాసనం తెలిపింది. ఏ దశలోనైనా ఎన్నికల సంఘం అనుసరించిన విధానాల్లో ఏదైనా చట్టవిరుద్ధంగా ఉన్నట్లు గుర్తిస్తే మొత్తం ప్రక్రియను రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈ అంశంపై తుది నిర్ణయం యావత్ దేశవ్యాప్తంగా వర్తిస్తుందని.. ముక్కలు ముక్కలుగా అభిప్రాయం చెప్పలేమని స్పష్టం చేసింది.
ఓటర్ల సవరణ ప్రక్రియకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను జస్టిస్ సూర్యకాంత్, జోయ్మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఎన్నికల కమిషన్ రాజ్యాంగ సంస్థ కావడంతో ‘సర్’ ప్రక్రియ నిర్వహణలో చట్టం, తప్పనిసరి నియమాలను పాటిస్తుందని కోర్టు అభిప్రాయపడింది. ఈ అంశంపై ఎలాంటి వివరణాత్మక అభిప్రాయాన్ని తెలిపేందుకు నిరాకరించింది. ఈ ప్రక్రియపై తుది నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది.
అయితే, ఓటర్ల జాబితా సవరణ కోసం ఎన్నికల కమిషన్ ఇలాంటి ప్రక్రియను నిర్వహించకుండా ఆపలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే, బీహార్ సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా పిటిషనర్లు అక్టోబర్ 7న యావత్ దేశవ్యాప్తంగా సర్పై వాదనలు వినేందుకు బెంచ్ అనుమతి ఇచ్చింది. బిహార్ సర్ అంశంలో 12వ గుర్తింపు పత్రంగా ఆధార్ కార్డును పరిగణించాలని ఆదేశిస్తూ ఈ నెల 8న ఇచ్చిన ఉత్తర్వును రీకాల్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8న ఆధార్ పౌరసత్వాన్ని రుజువు కాదని.. ఓటర్ల జాబితాలో పేరు చేర్చేందుకు గుర్తింపు కోసం పరిగణలోకి తీసుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది.