బెంగళూరు: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ కోసం డబ్బులు తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) స్పందించారు. ఆ ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. సీఎం సిద్ధరామయ్య, ఆయన కుమారుడు యతీంద్ర ‘క్యాష్ ఫర్ ట్రాన్స్ఫర్’ స్కామ్‌కు పాల్పడినట్లు జేడీ(ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు హెచ్డీ కుమారస్వామి ఇటీవల ఆరోపించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
కాగా, సీఎం సిద్ధరామయ్య ఈ ఆరోపణలపై ఆదివారం స్పందించారు. తమ ప్రభుత్వంలో ఒక్క ప్రభుత్వ అధికారి బదిలీ విషయంలో కూడా డబ్బులు బదిలీ కాలేదని తెలిపారు. కుమారస్వామి ప్రభుత్వ హయాంలోనే ఇలా నగదు బదిలీ జరిగిందని ఆరోపించారు. ‘బదిలీల కోసం వారు (కుమారస్వామి, జేడీఎస్ నేతలు) తీసుకున్న డబ్బు గురించి ఆయన (కుమారస్వామి) మాట్లాడుతున్నారు. ఆయన హయాంలో డబ్బులు తీసుకున్నారు. మా హయాంలో మేం డబ్బులు తీసుకోలేదు. నేను ఇంతకు ముందే చెప్పాను. ఒక్క బదిలీ విషయంలో అయినా డబ్బు తీసుకున్నట్లు రుజువైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఆయన (కుమారస్వామి) వంద సార్లు ట్వీట్ చేయనివ్వండి. నేను బదులివ్వదలచుకోలేదు’ అని అన్నారు.