ముంబై: మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ (Praful Patel) సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. విదర్భ ప్రాంతంలోని గోండియాలో శనివారం ఆయన పర్యటించారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు అంతం అవుతాయన్న విపక్షాల బూటకపు కథనాలకు ప్రజలు బలైపోయారని ప్రఫుల్ పటేల్ విమర్శించారు. కానీ ఇప్పుడు, ప్రజలు గ్రహించారని అన్నారు.
కాగా, డా. బీఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించారని ప్రఫుల్ పటేల్ తెలిపారు. రాజ్యాంగం అసలు నిర్మాణాన్ని లేదా రిజర్వేషన్‌ను ఎవరూ మార్చలేరని చెప్పారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి పార్లమెంటులో కూర్చున్న మా లాంటి చాలా మంది ఎంపీలు దీనిని జరుగనివ్వరని స్పష్టం చేశారు. ‘ఒకవేళ ఎవరైనా రిజర్వేషన్లకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తే, అలాంటి పరిస్థితిలో ఏ పదవిని నిర్వహించడం లేదా రాజకీయాల్లో కొనసాగడం వల్ల ప్రయోజనం ఉండదు. నేను రాజకీయాల నుంచి రిటైర్ అవుతా’ అని అన్నారు.
మరోవైపు మరాఠా రిజర్వేషన్లు రాజకీయంగా సున్నితమైన అంశమని ప్రఫుల్ పటేల్ తెలిపారు. మహాయుతి ప్రభుత్వం మరాఠా కోటాకు కట్టుబడి ఉందని చెప్పారు. ‘మరాఠాలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే చట్టం చేసింది. కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీలన్నీ ఎన్నో ఏళ్లుగా అధికారంలో ఉన్నాయి. మరాఠాలకు రిజర్వేషన్ల అంశం చాలా పాతది. ఈ సంఘం చాలా ఏళ్లుగా రిజర్వేషన్ కోరుతోంది’ అని అన్నారు.