e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home జాతీయం రైతుల తరహాలో ఉద్యమిస్తాం!

రైతుల తరహాలో ఉద్యమిస్తాం!

  • ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలి 
  • అప్పటిదాకా మా పోరాటం ఆగదు
  • కేంద్రానికి ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగుల హెచ్చరిక
  • దేశవ్యాప్తంగా ప్రదర్శనలు..సమ్మెలో 10లక్షల మంది 
  • బ్యాంకింగ్‌ సేవలకు తీవ్ర అంతరాయం 
  • నేడు కూడా కొనసాగనున్న సమ్మె 

కేంద్రంలో ప్రైవేటు పరం.. 

ప్రజలకు ఆర్థిక భద్రతను అందిస్తున్న ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటుపరం చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న తిరోగమన చర్యలపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సోమవారం హైదరాబాద్‌లో ఇండియన్‌ బ్యాంక్‌ జోనల్‌ ప్రధాన కార్యాలయం వద్ద బ్యాంకు ఉద్యోగులు భారీ ధర్నా నిర్వహించారు. భారీగా అప్పులు ఎగ్గొడుతున్న కార్పొరేట్లు, పారిశ్రామికవేత్తలపై కఠిన చర్యలు తీసుకోకుండా బ్యాంకులను ప్రైవేటుపరం చేయడం ఏమిటని ప్రశ్నించారు. 

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, మార్చి 15(నమస్తే తెలంగాణ): కేంద్రప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకొనేంతవరకు తమ పోరాటం ఆగదని ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగుల సంఘాలు స్పష్టం చేశాయి. కేంద్రం తిరోగమన చర్యలకు పాల్పడుతున్నదని విమర్శించాయి. కేంద్రం తమ ఆందోళనను పట్టించుకోకపోతే నిరవధిక సమ్మె చేస్తామని, అవరసరమైతే రైతుల తరహా ఉద్యమం చేపడుతామని ఆలిండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ (ఏఐబీఓసీ) జనరల్‌ సెక్రెటరీ సౌమ్య దత్తా అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ విధానాలపై ప్రజల వ్యతిరేకత ఫలితం.. వివిధ రాష్ర్టాల్లో జరగనున్న ఎన్నికల్లో కచ్చితంగా కనిపిస్తుందన్నారు. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా రెండు ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు రెండు రోజుల సమ్మెలో భాగంగా సోమవారం విధులను బహిష్కరించారు. ఉన్నతాధికారులు సహా దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. అనుమతులు ఉన్న చోట ర్యాలీలు నిర్వహించారు. సమ్మె కారణంగా బ్యాంకింగ్‌ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. నగదు డిపాజిట్లు, విత్‌ డ్రా, చెక్కు క్లియరెన్సులు ఆగిపోయాయి. కొన్ని బ్యాంకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటామని ప్రకటించినప్పటికీ ఖాతాదారులు ఇబ్బందులు పడ్డారు. చాలా చోట్ల బ్యాంకులు తెరుచుకోలేదు.  మంగళవారం కూడా సమ్మె కొనసాగుతుంది. యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. 

కార్పొరేట్‌ అప్పుల వల్లే నష్టాలు 

ప్రభుత్వ బ్యాంకుల సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా సోమవారం 2 కోట్ల చెక్కుల క్లియరెన్స్‌ ఆగిపోయిందని, వాటి విలువ దాదాపు రూ.16,500 కోట్లు ఉంటుందని ఆలిండియా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌(ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ వెంకటాచలం చెప్పారు. ప్రభుత్వ బ్యాంకులకు లాభాలు వస్తున్నాయని, అయితే కార్పొరేట్‌ సంస్థలకు ఇచ్చిన అప్పుల వల్ల నివేదికల్లో నష్టాలను చూపించాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. ‘2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ బ్యాంకులకు రూ.1,74,336 కోట్లు లాభం వచ్చింది. కానీ వస్తాయో రావో తెలియని అప్పులు రూ.2,00,352 కోట్లు ఉన్నాయి (వీటిలో అత్యధికం కార్పొరేట్‌ కంపెనీలు తీసుకున్నవే). దీంతో నష్టం 26,016 కోట్లు చూపించాల్సి వచ్చింది’ అని తెలిపారు.  

  • జాతీయ ఆస్తులను నాశనం చేస్తే ఊరుకోం
  • ప్రభుత్వ బ్యాంకులుంటేనే రైతులకు రుణాలు 
  • ఎఫ్‌వోఐబీఈయూ జాతీయ కార్యదర్శి పీవీ కృష్ణ

హైదరాబాద్‌, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : ప్రజలకు ఆర్థిక భద్రతను అందిస్తున్న ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటుపరం చేస్తూ మోదీ ప్రభుత్వం తిరోగమన చర్యలకు దిగుతున్నదని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జాతీయ కార్యదర్శి పీవీ కృష్ణారావు ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఇండియన్‌ బ్యాంక్‌ జోనల్‌ ప్రధాన కార్యాలయం వద్ద సోమవారం ధర్నాలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ బ్యాంకుల ద్వారానే రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు లభిస్తాయన్నారు. భారీగా అప్పులు ఎగ్గొడుతున్న కార్పొరేట్లు, ప్రైవేటీకరణను ఆపి ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయాలని డిమాండ్‌ చేశారు. బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ సంస్థలు, రైల్వేలు మొదలైన జాతీయ ఆస్తులను నాశనం చేయడం ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. ఇండియన్‌ బ్యాంకు అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీశ్‌చంద్ర కుమార్‌, ఏఐబీఈఏ నాయకుడు ఎంఎస్‌ కుమార్‌, వందలాది మంది బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా నిరసనలు జరిగాయి.

సమ్మెకు సీపీఎం మద్దతు

ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగుల సమ్మెకు సీపీఎం మద్దతు ప్రకటించింది. బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మోదీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. బ్యాంకులు ప్రైవేటుపరమైతే రైతులు, మహిళలకు తక్కువ వడ్డీ రుణాలు అందకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రైతుల తరహాలో ఉద్యమిస్తాం!

ట్రెండింగ్‌

Advertisement