Vijay Shah | భారతీయ మహిళా సైనికాధికారి కర్నల్ సోఫియా ఖురేషీ (Colonel Sofiya Qureshi)పై మధ్యప్రదేశ్ మంత్రి (Madhya Pradesh Minister), బీజేపీ నాయకుడు కున్వర్ విజయ్ షా (Vijay Shah) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ విషయంలో మంత్రిపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇంత వివాదం చెలరేగినప్పటికీ ఆయన్ని మంత్రి పదవి నుంచి బీజేపీ ప్రభుత్వం తొలగించలేదు.
ఈ విషయంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకు ఆయన్ని పదవి నుంచి తొలగించలేదంటూ ప్రశ్నిస్తున్నాయి. మంత్రి పదవికి విజయ్ షా రాజీనామా చేస్తారా..? లేదా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ షా రాజకీయ భవిష్యత్తుపై మే 28 తర్వాత ఏదైనా నిర్ణయం ఉంటుందని బీజేపీ వర్గాలు తాజాగా వెల్లడించాయి. విజయ్ షా వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ బృందం మే 28న సుప్రీం కోర్టుకు నివేదికను సమర్పిస్తుంది. సిట్ (SIT) నివేదిక సమర్పించిన తర్వాతే ఆయన రాజీనామాపై నిర్ణయం వెలువడుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.
‘కోర్టు జారీ చేసే ఏ ఆదేశానికైనా కట్టుబడి ఉంటామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. మే 28న సిట్ తన నివేదికను సమర్పించిన తర్వాత విజయ్ షాకు సంబంధించి ఏదైనా నిర్ణయం ఉంటుంది’ అని బీజేపీ వర్గాలు తెలిపాయి. మరోవైపు సీఎం మోహన్ యాదవ్ ఇవాళ ఇండోర్‌లో కేబినెట్ భేటీ నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి షా హాజరుకాకపోవచ్చని తెలిసింది. తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తు గురించి పార్టీ హైకమాండ్‌తో మాట్లాడేందుకు షా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి.
మిమ్మల్ని చూసి యావద్దేశం సిగ్గుపడుతోందంటూ దేశ అత్యున్నత ధర్మాసనం విజయ్ షాను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. చేసిన చెత్త వ్యాఖ్యలకు విజయ్ షా చెప్పిన క్షమాపణను తిరస్కరిస్తున్నట్లు సుప్రీంకోర్టు సోమవారం ప్రకటించింది. ‘ఎటువంటి ఆలోచన లేకుండా చేసిన మీ చెత్త వ్యాఖ్యలకు మీరు ఇచ్చిన క్షమాపణ మాకు అవసరం లేదంటూ’ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
స్వయం కృతాపరాధం వల్ల ఏర్పడిన పరిస్థితి నుంచి బయటపడేందుకే విజయ్ షా మొసలి కన్నీళ్లు కారుస్తున్నట్లు తమకు అనుమానంగా ఉందని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ ఉదంతాన్ని దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి వివరాలను వివరించేందుకు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో కలసి కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ విలేకరుల సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. మరోవైపు వివాదాస్పద వ్యాఖ్యలకు గానూ విజయ్ షాపై కేసు కూడా నమోదైంది.
Also Read..
Supreme Court | మిమ్మల్ని చూసి దేశం సిగ్గుపడుతున్నది.. మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రిపై సుప్రీం ఆగ్రహం
Car Parking | పార్కింగ్ స్థలం చూపిస్తేనే వాహనానికి రిజిస్ట్రేషన్ : మహారాష్ట్ర ప్రభుత్వం