Bengaluru | బెంగళూరు నగరంలో రోడ్లు అధ్వానంగా మారాయని (Poor Roads), వాటిపై ప్రయాణించడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నట్లు ఓ వ్యక్తి ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ మేరకు బృహత్ బెంగళూరు మహానగర పాలికె (BBMP)కి రూ.50 లక్షల నష్టపరిహారం కోరుతూ లీగల్ నోటీసు పంపారు.
రిచ్మండ్టౌన్లో నివాసం ఉండే 45 ఏళ్ల దివ్య కిరణ్ (Dhivya Kiran) స్థానిక ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్నప్పటికీ నగరంలో మౌలిక సదుపాయాల కల్పనలో బీబీఎంపీ విఫలమైందని ఆరోపించారు. ఫలితంగా నగరంలో రోడ్లు అధ్వానంగా మారాయని తెలిపారు. గుంతలు పడిన రోడ్లపై ప్రయాణించడం వల్ల తాను శారీరక ఇబ్బందులు, మానసిక వేదనను ఎదుర్కొంటున్నానని చెప్పారు. తీవ్రమైన వెన్నునొప్పి కారణంగా నిత్యం ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
తీవ్రమైన మెడ, వెన్ను నొప్పి కారణంగా తాను ఆర్థోపెడిక్ వైద్యుడి వద్దకు ఐదుసార్లు, ఫిలోమినా ఆసుపత్రిలో నాలుగుసార్లు అత్యవసర చికిత్స తీసుకున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నొప్పులు రోడ్ల దుస్థితి వల్లే వచ్చాయని వైద్యులు కూడా ధ్రువీకరించారని ఆయన వివరించారు. ఈ మేరకు దివ్య కిరణ్ తరఫున న్యాయవాది కేవీ లవీన్ మే 14న బీబీఎంపీకి ఈ నోటీసును పంపారు. నొప్పులకు ఇంజెక్షన్లు కూడా చేయించుకున్నానని.. అనేక మందులు వాడుతున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. 15 రోజుల్లోగా రూ.50 లక్షల నష్టపరిహారంతో పాటు, లీగల్ ఖర్చుల కింద రూ.10,000 చెల్లించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులో హెచ్చరించారు. అయితే, ఈ నోటీసుపై బీబీఎంపీ ఇప్పటి వరకూ స్పందించలేదు.
Also Read..
Indian Envoy | అమెరికా తరహాలో పాక్ సైతం ఉగ్రవాదులను అప్పగించాలి : ఇజ్రాయెల్లో భారత రాయబారి
Beating Retreat: 10 రోజుల సీజ్ఫైర్ తర్వాత.. నేటి నుంచి బీటింగ్ రిట్రీట్ సెర్మనీ