బెంగళూరు, సెప్టెంబర్ 5: బంగారు బాతుల్లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తున్న కేంద్రంలోని మోదీ సర్కార్.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కార్యకలాపాలను ప్రైవేటీకరించే దిశగా అడుగులు వేస్తున్నది. దీనిపై ఇస్రో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఆరేండ్ల క్రితం ప్రభుత్వం భారత అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ పరిశ్రమలకు అందుబాటులోకి తీసుకురావడం ప్రారంభించినప్పటి నుంచి మొదటిసారిగా అంతరిక్ష శాఖ(డీఓఎస్) పరిధిలోని ఇస్రో కేంద్రాలకు చెందిన వేలాదిమంది సిబ్బందికి ప్రాతినిధ్యం వహిస్తున్న 9 ఉద్యోగ సంఘాలు ఈ మార్పు దిశ, ప్రాతిపదికపై అధికారికంగా తమ ఆందోళనను వ్యక్తం చేశాయి.
డీవోఎస్ కార్యదర్శిగా, ఇస్రో చైర్మన్‌గా వ్యవహరిస్తున్న స్పేస్ కమిషన్ చైర్మన్ నుంచి ఈ సంఘాలు లిఖితపూర్వక వివరణ కోరాయి. పటిష్టమైన ప్రభుత్వ యాజమాన్యంలోని ఇస్రోతోపాటుగా నిర్దిష్ట వాణిజ్య కార్యకలాపాలలో ప్రైవేట్ భాగస్వామ్యం కొనసాగగలదు. దేశ ప్రయోగ వాహక నౌకల రూపకల్పన, దాని ప్రయోగ మౌలిక సదుపాయాల నిర్వహణ ప్రభుత్వ చేతుల నుంచి జారిపోతుండగా ఇస్రోను కేవలం నామమాత్రపు ఆర్అండ్డీ విభాగానికి పరిమితం చేసే విధానాన్ని చర్చ లేకుండా అంగీకరించలేము అని సెప్టెంబర్ 4న రాసిన వినతిపత్రంలో సంఘాలు పేర్కొన్నాయి.
ఇస్రో అభివృద్ధి చేసిన సాంకేతికతను జాతీయ ఆస్తిగా అభివర్ణిస్తూ దాని బదిలీ పారదర్శకంగా, జవాబుదారీగా ఉండాలని, అలాగే వ్యూహాత్మక, భద్రత, ఉపాధిపరమైన అంశాలకు అనుగుణంగా ఉండాలని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. ఉద్యోగులకు సమాచారం తెలుసుకునే, సంప్రదించే , రక్షణ పొందే అర్హత ఉందని, సహజ న్యాయం, సుపరిపాలన ప్రకారం ఇంతటి ప్రాముఖ్యత గల విధానాన్ని సంబంధిత శాఖే స్వయంగా ఉద్యోగులకు వివరించాలని వినతిపత్రం పేర్కొంది.
ఇస్రో భవిష్యత్తులో ఎటువంటి ప్రయోగ వాహనాలను తయారు చేయదని ఇన్-స్పేస్ చైర్మన్ పవన్ గోయెంకా ఇటీవల చేసినట్టుగా చెబుతున్న బహిరంగ ప్రకటనను ప్రస్తావిస్తూ ఆ ప్రకటన భారత ప్రభుత్వం, అంతరిక్ష కమిషన్ లేదా డీవోఎస్ ఆమోదించిన నిర్ణయానికి ప్రతిరూపమా? ఒకవేళ ఆమోదించి ఉంటే ఆ విధానపరమైన నిర్ణయానికి సంబంధించిన తేదీ, అధికారం, పాఠ్యాన్ని దయచేసి తెలియచేయగలరు అని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి.
పన్ను చెల్లింపుదారుల నిధులు, తరతరాలుగా ఇస్రో ఉద్యోగుల శ్రమతో రూపొందించిన సాంకేతికత, పరీక్షా కేంద్రాలు, ప్రయోగ కేంద్రాలు, సాంకేతిక పరిజ్ఞానం వంటి వాటిని ప్రైవేట్ నిర్వహణకు బదిలీ చేయడం లేదా అందుబాటులో ఉంచడం ఏ సంస్థాగత ఏర్పాట్ల కింద జరుగుతున్నదో, అలాగే అటువంటి బదిలీల్లో ఎన్-స్పేస్‌తో పోలిస్తే ఎన్ఎస్ఐఎల్ పాత్ర ఏమిటో కూడా లిఖితపూర్వకంగా ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరాయి.
ప్రయోగ వాహనాలు, ఉపగ్రహాల రూపకల్పన నుంచి ఇస్రో క్రమంగా వైదొలగడం వల్ల పరిశోధన అనంతర ప్రయోగాలు దెబ్బతింటాయని, అంతర్గత పనులు తగ్గిపోయి మంజూరైన సిబ్బంది సంఖ్యను స్తంభింపచేయడం లేదా తగ్గించడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే సాంకేతిక, శాస్త్రీయ, పరిపాలన, స్టోర్స్, కొనుగోలు, నాణ్యత, భద్రత, పదోన్నతులు, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు మూసుకుపోతాయని ఆందోళన చెందుతున్నట్టు ఉద్యోగ సంఘాలు తమ వినతిపత్రంలో పేర్కొన్నాయి.