ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో యూపీ ఒకటి. మిగతా నాలుగు ఎలా ఉన్నా, అందరి దృష్టి మాత్రం యూపీపైనే. అయితే ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యూపీ ఎన్నికలు వాయిదా పడతాయా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా, రాజకీయ పార్టీల ర్యాలీలు, సమావేశాలు మాత్రం యథావిథిగానే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూపీ ఎన్నికలను వాయిదా వేయాలని అలహాబాదు హైకోర్టు ప్రధాని మోదీకి సూచించింది. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి స్పందించారు.
వచ్చే వారు తాము యూపీలో పర్యటిస్తామని, క్షేత్ర స్థాయిల ఉన్న పరిస్థితులపై పూర్తి అంచనాకు వచ్చిన తర్వాత, వాయిదా విషయంపై తాము ఆలోచిస్తామని ఆయన తేల్చి చెప్పారు. మరోవైపు ఎన్నికల ర్యాలీలు, సభలను నిషేధించాలంటూ సుప్రీంలో ఇప్పటికే ఓ పిటిషన్ కూడా దాఖలైంది. మరోవైపు యూపీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఈ నెల 27న కేంద్ర ఎన్నికల సంఘం ఆరోగ్య శాఖ కార్యదర్శితో ఓ భేటీ నిర్వహిస్తోంది. దీని తర్వాతే ఎన్నికల నిర్వహణ, తేదీల ప్రకటన లాంటి విషయాలపై కేంద్ర ఎన్నికల సంఘం తుది నిర్ణయానికి వస్తుందని తెలుస్తోంది. అయితే యూపీ ఎన్నికలను మాత్రం వాయిదా వేయాలన్న ఆలోచనలోనే ఈసీ ఉన్నట్లు సమాచారం.