Yogi Adityanath : మహారాష్ట్ర (Maharastra) లోని బీడ్ జిల్లా (Beed district) లో జరిగిన ‘ఐ లవ్ మహమ్మద్ (I Love Mohammad)’ కార్యక్రమంలో ఓ ముస్లిం నేత యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యోగి ఆదిత్యనాథ్‌ను పాతిపెడతామని బహిరంగ హెచ్చరిక చేశారు. ‘ఐ లవ్ మహమ్మద్’ ప్రోగ్రామ్‌లో ఓ మౌలానా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
యోగి ఆదిత్యనాథ్ మాజల్గావ్లోని ముస్తఫా మసీదుకు రావాలని ఆ మౌలానా సవాల్ చేశారు. ఆయన గనుక అక్కడికి వస్తే అక్కడే పాతిపెడతామని హెచ్చరించారు. ఈ బెదిరింపు వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అష్ఫాక్ నిసార్ షేక్‌గా గుర్తించారు. చాలా రోజుల క్రితమే ఆయన ఈ హెచ్చరికలు చేసినప్పటికీ తాజాగా ఆ వీడియో బయటికి వచ్చింది.
దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మౌలానాపై కఠిన చర్యలు తీసుకోవాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం మౌలానా మాట్లాడిన ఆ వీడియో విశ్వసనీయతను అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా మహమ్మద్ ప్రవక్త జయంత్యుత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో బారావఫత్ వేడుకలు జరిపారు.
ఈ వేడుకల్లో ‘ఐ లవ్ మహమ్మద్’ ప్రచారం చేపట్టారు. ప్రవక్తపై తమ విశ్వాసాన్ని చాటుకుంటూ ముస్లిం యువకులు ‘ఐ లవ్ మహమ్మద్’ అని రాసి ఉన్న బ్యానర్లు, పోస్టర్లు ప్రదర్శించారు. అయితే హిందూ గ్రూపులు ఈ చర్యను వ్యతిరేకించాయి. రెచ్చగొట్టే కొత్త సంప్రదాయంగా దీన్ని విమర్శించాయి. పోలీసుల జోక్యంతో ఉద్రిక్తతలు తలెత్తాయి.