K Annamalai : తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం సీఎం విజయ్ తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న పేరు కే అన్నామలై. తమిళనాడు బీజేపీలో కీలక నేతగా ఉన్న అన్నామలై.. ఆ పార్టీపై అసంతృప్తితో ఇటీవల రాజీనామా చేసినట్లు ప్రచారం జరిగింది. ఆయన బీజేపీకి రాజీనామా చేశారని, త్వరలోనే సొంత పార్టీ పెడతారనే ప్రచారం ఊపందుకుంది. అయితే, ఈ ప్రచారానికి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తెరదించారు. అన్నామలై బీజేపీకి రాజీనామా చేయలేదన్నారు. తనకు ఆయన రాజీనామా లేఖ అందలేదని తెలిపారు.
పార్టీ అధ్యక్షుడికి అన్నామలై రాజీనామా లేఖ అందలేదంటే అధికారికంగా ఆయన ఇంకా బీజేపీకి రాజీనామా చేయనట్లే లెక్క. అలాగే, ఆయన కొత్త పార్టీ పెడుతున్నారనే విషయం గురించి కూడా తనకేమీ సమాచారం లేదని నాగేంద్రన్ తెలిపారు. దీంతో అన్నామలై బీజేపీకి రాజీనామా చేశారనే ప్రచారానికి తెరదించినట్లైంది. ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. అక్కడ పార్టీకి కాస్తో.. కూస్తో గుర్తింపు తెచ్చిపెట్టిన నేత ఆయనే. అయితే, గత ఏడాది ఆయనను అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. ఎలాంటి పదవీ అప్పగించలేదు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు బీజేపీ సీటు కూడా లభించలేదు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీని వీడి, కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఇదే సమయంలో ఆయన బీజేపీ అగ్రనేతలను కలిశారు. వారంతా అన్నామలైను మరికొంతకాలం ఆగాలి అని సూచించినట్లు తెలుస్తోంది. పార్టీలోనే ఉండమని పార్టీ పెద్దలు కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా లేదు. అయితే, గురువారం అన్నామలై పుట్టిన రోజు. ఈ సందర్భంగా నాగేంద్రన్ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో తనకు, అన్నామలైకు మధ్య ఎలాంటి విబేధాలు లేవన్నారు.
మరోవైపు తన రాజీనామాపై జరుగుతున్న ప్రచారంపై అన్నామలై స్పందించారు. ఈ అంశంపై జూన్ 5, శుక్రవారం కీలక వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా అందరితో మాట్లాడతానని ప్రకటించారు. దీంతో అందరూ ఆయన ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.