అహ్మదాబాద్, జూన్ 13: భార్య అంతిమ కోరిక మేరకు ఆమె చితాభస్మాన్ని నర్మదా నదిలో కలపడానికి లండన్ నుంచి వచ్చిన ఇండో బ్రిటీషర్ అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించాడు. లండన్ కేంద్రంగా నివసిస్తున్న అర్జున్ మనుభాయ్ పటోలియా (36), భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి లండన్లో నివసిస్తున్నాడు. వారం రోజుల క్రితం అతని భార్య భారతీబెన్ కన్నుమూసింది.
తన అస్థికలను మాతృభూమి భారత్లో కలపాలని ఆమె భర్తను చివరి కోరిక కోరింది. దీంతో అర్జున్ ఆమె చితాభస్మాన్ని పట్టుకుని గుజరాత్లోని అమ్రెలీ జిల్లాలోని తన పూర్వీకుల గ్రామం వడియాకు వచ్చి నర్మదా నదిలో నిమజ్జనం చేశాడు. అహ్మదాబాద్లో విమానం ఎక్కి లండన్ వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో మరణించాడు. వారం రోజుల వ్యవధిలోనే తల్లిదండ్రులు మరణించడంతో లండన్లో ఉన్న వారి 4, 8 ఏండ్ల కుమార్తెలు అనాథలుగా మారారు.