లక్నో: ఒక మహిళ తన భర్తను జైలుకు పంపింది. (Wife sent husband to jail, posts photos) అతడు జెలుకెళ్లినట్లు వ్యంగ్య ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో మనస్తాపానికి గురైన అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో భార్య, ఆమె కుటుంబంపై ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఈ సంఘటన జరిగింది. 28 ఏళ్ల రాజ్ ఆర్యకు ఏడాది కిందట సిమ్రాన్‌తో పెళ్లి జరిగింది. వారికి ఒక కుమారుడు ఉన్నాడు.
కాగా, భర్త రాజ్‌తో గొడవల వల్ల భార్య సిమ్రాన్ తన పుట్టింటికి వెళ్లింది. బంధువు పెళ్లికి భార్యను తీసుకెళ్లేందుకు అత్తవారింటికి రాజ్ వెళ్లాడు. అయితే సిమ్రాన్‌ను అతడితో పంపేందుకు ఆమె కుటుంబం నిరాకరించింది. ఈ సందర్భంగా ఆమె సోదరులు రాజ్‌ను కొట్టారు. అలాగే అతడిపై మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బరేలీకి తిరిగి వచ్చిన రాజ్‌ను పోలీసులు పిలిపించారు. ఈ సందర్భంగా అతడి భార్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘10.30 కల్లా నువ్వు జైలుకి వెళ్తావు. బెస్ట్ ఆఫ్ లక్, ఇప్పుడు నువ్వు జైలుకు వెళ్ళు’ అని క్యాప్షన్ ఇచ్చింది.
మరోవైపు రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉన్న రాజ్ ఆ మరునాడు ఇంటికి తిరిగి వచ్చాడు. భార్య, ఆమె కుటుంబం తీరుపై తీవ్ర మనస్తాపం చెందాడు. అమ్మా నేను శాశ్వత నిద్రలోకి వెళ్తున్నా అని తల్లికి చెప్పాడు. తన గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కాగా, రాజ్ సూసైడ్‌కు భార్య సిమ్రాన్, ఆమె కుటుంబం కారణమని అతడి కుటుంబం ఆరోపించింది. పోలీస్ అధికారి అయిన సిమ్రాన్ సోదరుడు, ఇతర పోలీసులు స్టేషన్లో రాజ్‌ను కొట్టి హింసించారని ఫిర్యాదు చేశారు. అలాగే సిమ్రాన్‌కు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపించారు. దీంతో రాజ్ ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.