అహ్మదాబాద్ : గుజరాత్లో దారుణం జరిగింది. భర్తను ప్రియుడితో కలిసి చంపేసిన మహిళ ఉదంతం సంచలనంగా మారింది. జామ్‌నగర్‌కు చెందిన జిగ్నేశ్ మవాడియాను భార్య పృథ్వీ తన ప్రియుడు నిలేశ్తో కలిసి మద్యంలో విషమిచ్చి చంపేసింది. ఆ తర్వాత నగరం శివార్లలోని ఓ ఫ్యాక్టరీలో 12 అడుగుల లోతులో జిగ్నేశ్‌ను వీరిద్దరూ కలిసి పూడ్చిపెట్టారు.
తన భర్త ఆస్ట్రేలియా వెళ్లాడని.. శాశ్వత నివాసం పొందిన తర్వాత ఇండియాకు వస్తానని చెప్పాడంటూ రెండేండ్ల పాటు అందరినీ నమ్మిస్తూ వచ్చింది. జిగ్నేశ్ తమ్ముడు అశోక్ ధర్మేష్ భాయ్ ఆస్ట్రేలియాకు వెళ్లగా తన అన్న జాడ కనిపించలేదు. అనుమానం వచ్చి జామ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పృథ్వీని, నిలేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. 2024 మే నెలలో చంపేసినట్టు ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టంకు పంపించారు. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.