న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో (ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ (28) హత్య) ప్రధాన నిందితురాలు సోనమ్‌కి కోర్టు బెయిల్ మంజూరుచేసింది. 2025లో వివాహం అనంతరం హనీమూన్ నిమిత్తం భర్త రాజా రఘువంశీతో మేఘాలయలోని కొండ ప్రాంతానికి వెళ్లిన సోనమ్, పక్కా ప్లాన్ ప్రకారం భర్తను హత్య చేయించిందన్న ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసులో ఆమెకు షిల్లాంగ్‌లోని ఓ కోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరుచేసింది. షిల్లాంగ్‌ను వీడి వెళ్లరాదని, ప్రతి రోజూ స్థానిక పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలని కోర్టు ఆమెను ఆదేశించింది. తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసిందని, సోనమ్ సమక్షంలో ముగ్గురు కిరాయి హంతకులు రాజా రఘువంశీని హత్యచేశారని ఆమెపై ఆరోపణలున్నాయి.