కోల్‌కతా, జనవరి 14: తప్పిపోయిన భార్యాబిడ్డలను ఒక వ్యక్తి 13 ఏండ్ల తర్వాత కలుసుకున్న అరుదైన ఘటన కోల్‌కతాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన లనిత్ బరేత్ 2010లో మానసిక స్థితి సరిగ్గా లేని తన భార్య గుర్బారీ (27), 11 ఏండ్ల పిల్లాడితో 2010లో కోల్‌కతాలో చికిత్స కోసం వచ్చాడు. అయితే భార్య, బిడ్డలు ఆ మహా నగరంలో తప్పిపోయారు.
అయితే గుర్బారీ పోలీసులకు దొరికినా ఆమె తన అడ్రస్, వివరాలు చెప్పలేకపోవడంతో ఆమెను దవాఖానలో, ఆమె కుమారుడిని అనాథాశ్రమంలో చేర్చా రు. అయితే గుర్బారీకి పూర్తిగా నయమైందని దవాఖాన అధికారులు ఇటీవల చెప్పడంతో ఆమె చిరునామా కోసం పోలీసులు వెతుకులాట ప్రారంభించారు. అయితే గంగాసాగర్ మేళాకు వచ్చిన లనిత్కు భార్య, కుమారుడి గురించి తెలియడంతో వారిని పట్టుకుని ఆనంద భాష్పాలు రాల్చాడు. వారు ఎప్పటికైనా తిరిగి వస్తారన్న నమ్మకం తనకు ఉందని, అందుకే తాను రెండో పెండ్లి కూడా చేసుకోలేదని చెప్పాడు.