న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో ఎక్కడ చూసినా భద్రతా సిబ్బంది కనిపిస్తారు. అయితే ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది పర్యాటకులు మరణించిన ప్రముఖ పర్యాటక కేంద్రం పహల్గామ్లో కనీస భద్రత కూడా లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. (Pahalgam Attack) గురువారం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా ఈ ప్రశ్నను లేవనెత్తాయి. పర్యాటక పచ్చికభూమి అయిన బైసరన్‌లో భద్రతా దళాలు లేకపోవడాన్ని కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌తో సహా పలువురు ఈ అంశంపై కేంద్రాన్ని నిలదీశారు. ప్రముఖ టూరిస్ట్ స్పాట్ బైసరన్‌లో భద్రతా సిబ్బందిని ఎందుకు మోహరించలేదని ప్రశ్నించారు.
కాగా, కేంద్ర ప్రభుత్వం చాలా భిన్నంగా సమాధానం ఇచ్చింది. టూరిస్ట్ ఆపరేటర్లపై తప్పును మోపింది. సాధారణంగా జూన్‌లో ప్రారంభమయ్యే వార్షిక అమర్నాథ్ యాత్రకు ముందు బైసరన్ ప్రాంతంలో భద్రతా సిబ్బందిని మోహరిస్తారని తెలిపింది. ఆ సమయంలోనే ఈ మార్గాన్ని అధికారికంగా తెరుస్తారని చెప్పింది. దీంతో అమర్నాథ్ గుహ మందిరానికి వెళ్లే దారిలో ఉన్న బైసరన్ వద్ద యాత్రికులు విశ్రాంతి తీసుకుంటారని పేర్కొంది. ఈ నేపథ్యంలో కేవలం అమర్నాథ్ యాత్ర సమయంలోనే ఇక్కడ భద్రతా బలగాలను మోహరిస్తారని వివరించింది.
మరోవైపు స్థానిక టూర్ ఆపరేటర్లు ఏప్రిల్ 20 నుంచే ఈ ప్రాంతానికి పర్యాటకులను తీసుకెళ్లడం ప్రారంభించారని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది. దీని గురించి స్థానిక పరిపాలనా యంత్రాంగానికి వారు సమాచారం ఇవ్వలేదని పేర్కొంది. అందుకే ప్రముఖ టూరిస్ట్ స్పాట్ బైసరన్ ప్రాంతంలో భద్రతా దళాలను మోహరించలేదని వెల్లడించింది.