Ban on Foodstalls in Gujarat | నోరూరించే వంటకాలంటే ఎవరైనా కాదంటారా.. కానీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నాన్‌వెజ్ ఫుడ్స్టాల్స్పై కొరడా ఝుళిపిస్తోంది. ఎగ్స్‌తో వివిధ రకాల వంటకాలు తయారు చేసే వీధి వ్యాపారులపై అహ్మదాబాద్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రోడ్డు వెంబడి ఎగ్స్, ఇతర నాన్‌వెజ్ ఫుడ్‌తో సేవలందిస్తున్న తోపుడు బండ్లను సీజ్ చేస్తున్నారు. 20 ఏండ్లుగా బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వలస వచ్చిన వందలాది మంది కార్మికులు.. వ్యాపారుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
అహ్మదాబాద్‌లోని జోధ్‌పూర్, మణినగర్, వస్త్రపూర్, ఆశ్రమ్ రోడ్డు, బెహ్రంపుర ప్రాంతాల్లో 50కి పైగా ఫుడ్ స్టాల్స్‌ను అధికారులు తొలగించేశారు. వస్త్రపూర్లో 11 తోపుడు బండ్లను అధికారులు స్వాధీనం చేసుకోవడంతో ప్రతి ఒక్కరూ ఎప్పుడేం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. రోడ్లపై ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకున్న నాన్‌వెజ్ ఫుడ్కార్ట్లను తొలగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో తోపుడు బండ్లతోపాటు వాటితోపాటు కస్టమర్లు కూర్చోవడానికి తెచ్చుకున్న కుర్చీలు, స్టూళ్లు అధికారులు తీసుకెళుతున్నారు.
వారణాసికి చెందిన 20 ఏండ్ల వలస కార్మికుడు స్పందిస్తూ.. ఒక ఫుడ్ స్టాల్లో పని చేయడానికి రెండు నెలల క్రితం ఇక్కడికి వచ్చానని చెప్పాడు. 15 ఏండ్లుగా అహ్మదాబాద్‌లోనే ఉంటున్నా.. ఉద్యోగం లేకపోతే తానేం చేయాలని అంటున్నాడు. అయితే, అధికార బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీపీ పాటిల్ మాట్లాడుతూ.. అధికారికంగా నాన్‌వెజ్ ఫుడ్ స్టాల్స్‌పై ఎటువంటి నిషేధం లేదన్నారు. ప్రజలు తమకు ఇష్టమైన భోజనం, వంటకాలు తినే హక్కు ఉందన్నారు. వారిని ఎవరూ నిలువరించలేరన్నారు. పరిశుభ్రత పాటించకపోతే మాత్రం సదరు ఫుడ్ స్టాల్స్మీద చర్య తీసుకోవచ్చునన్నారు.
వడోదరలో మైనారిటీలు అత్యధికంగా నివసించే తాండాల్జా ప్రాంతంలో రోడ్డు పక్కనే కబాబ్‌లు, కీమా సమోసాలు, ఫ్రైడ్ ఫిష్, చికెన్ లాలీపాప్‌లు, శావర్మ వంటి ఫుడ్స్ తయారు చేస్తుంటారు. పరిశుభ్రత పాటించేందుకు 15 రోజుల్లో చర్యలు తీసుకోకపోతే చర్యలు తప్పవని గతవారం ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ పలువురు హిందువులు రాత్రి వేళ తమ తోపుడు బండ్ల వద్దకు వచ్చి నాన్‌వెజ్ ఫుడ్ తింటూ ఉంటారని ఓ కస్టమర్ వ్యాఖ్యానించాడు.
ఏండ్ల తరబడి వడోదర, అహ్మదాబాద్ వంటి నగరాల్లో తోపుడుబండ్లపై ఆధారపడి పలువురు జీవనం సాగిస్తున్నారు. కరోనా వేళ విధించిన లాక్డౌన్లతో తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాం.. తాజాగా ప్రభుత్వ ఆదేశాలతో మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఓ ఫుడ్ స్టాల్ ఓనర్ తెలిపాడు. తందూరీ కబాబ్‌లు విక్రయించే మరో వెండార్.. తమ ఫుడ్ స్టాల్లో తయారు చేసిన ఫుడ్స్ ప్రత్యేకించి స్క్యూవర్లు, తందూరీలపై వస్త్రాలు కప్పి ఉంచుతున్నట్లు తెలిపారు. చాలా మంది వెండార్లు ప్రభుత్వాధికారులు ఎందుకు తమ ఫుడ్ స్టాల్స్ మీద నిషేధం విధిస్తున్నారో అర్థం కావట్లేదని వాపోతున్నారు.