చండీగఢ్: అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారత వలసదారులను ఆ దేశ ఎయిర్‌ఫోర్స్ విమానాల్లో తరలిస్తున్నారు. (US Deportation) ఫిబ్రవరి 5న మొదటి బ్యాచ్ కింద 104 మంది భారతీయులతో ఒక విమానం పంజాబ్‌లోని అమృత్సర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. ఫిబ్రవరి 15, 16న మరో రెండు విమానాలు కూడా ఇక్కడ ల్యాండ్ కానున్నాయి. అయితే అమెరికాలోని భారత అక్రమ వలసదారులను కేవలం పంజాబ్‌కే తరలించడంపై రాజకీయ వివాదం చెలరేగింది. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అమృత్సర్ను ల్యాండింగ్ పాయింట్‌గా ఎంచుకున్నట్లు ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వంతోపాటు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం తీరును విమర్శించింది.
కాగా, అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారత వలసదారులను పంజాబ్‌కు తరలించాలన్న కేంద్రం నిర్ణయంపై సీఎం భగవంత్ మాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన అమృత్‌సర్‌కు చేరుకున్నారు. దీనిపై మీడియా సమావేశంలో ఆయన మాట్లాడనున్నారు. ఈ చర్య వెనుక కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలను సీఎం భగవంత్ మాన్ ప్రశ్నించనున్నట్లు తెలుస్తున్నది.