న్యూఢిల్లీ, జూన్ 9 : దేశంలో వెరైటీ పేర్లతో పార్టీలు పెట్టే ట్రెండ్ మొదలైంది. ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నిన్న యూపీ బీజేపీ సీనియర్ నేత అనూప్ రాఘవ్ చీంటీ జనతా పార్టీని స్థాపించారు. ఇక తాజాగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ ఇష్క్ కరో పార్టీని స్థాపించారు. సీజేపీకి పోటీగా ఆయన ఈ పార్టీని పెట్టారు. భారత యువత తన పార్టీలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే టీఎంసీ నేత మహువా మొయిత్రాను, జర్నలిస్టు మృణాల్ పాండే ను కూడా పార్టీలో చేరాలని కోరారు.
కట్జూ తన పార్టీ విధానాలను ఎక్స్ పోస్టులో తెలిపారు. ‘అందరూ అనుకుంటున్నట్టు ఇష్క్ కరో అంటే రొమాంటిక్ లవ్, వాలంటైన్స్ డే తరహా లవ్ కాదు. ఇష్క్ కరో అంటే దేశ ఐక్యతను చూపించేది. దేశంలోని వివిధ కులాలు, మతాలు తమ విభేదాలను పక్కన పెట్టి కలిసి ఉండేలా చేసేది. విభేదాలను పక్కన పెట్టి కేవలం ప్రేమను పంచేది అని అర్థం‘ అని కట్జూ వెల్లడించారు.