India Pakistan Ceasefire | హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): శనివారం సాయంత్రం 5 గంటల సమయం.. పాకిస్థాన్‌తో యు ద్ధంలో ఏం జరుగుతున్నదని దేశం యావత్తు టీవీలకు అతుక్కుపోయి చూస్తున్నది. ఇంతలో అకస్మాత్తుగా టీవీ స్క్రీన్లపై ఒక బ్రేకింగ్ న్యూస్ ప్రత్యక్షమైంది. దాని సారాంశం ఏమిటంటే.. ‘భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఆ రెండు దేశాలతో మేం సుదీర్ఘ చర్చలు జరిపాం. కాల్పులు విరమించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీంతో అందరూ ఒక్కసారిగా కండ్లు నులుముకొని చూశారు. ఇది కలా.. నిజమా? అని ఆశ్చర్యపోయారు. భారత సైన్యం అప్రతిహత విజయాలు సాధిస్తున్న సమయంలో అకస్మాత్తుగా మోదీ ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించడం ఏమిటని విస్తుపోయారు. అనేక చానళ్లు మార్చారు. కానీ ఏ చానల్ మార్చి చూసినా ఇదే వార్త! ఒకే బ్రేకింగ్! బీజేపీకి పెద్ద మద్దతుదారుగా ఉన్న ఓ జాతీయ చానల్ యాంకర్ అయితే.. అదెట్లా సాధ్యమని హూంకరించారు. కాల్పుల విరమణ ప్రకటించడానికి ట్రంప్ ఎవరంటూ తనదైన శైలిలో గొంతు చించుకొని అరిచారు.
ఇదిట్లా కొనసాగుతుండగానే.. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్రీ మీడియా సమావేశం నిర్వహించారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. పాక్ డీజీఎంవో ఫోన్ చేయడంతో తాము అంగీకరించామని చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సైతం ఈ వార్తను ధ్రువీకరించారు. తర్వాత అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో సైతం ఇదే ప్రకటన చేశారు. దీంతో కాల్పుల విరమణ నిజమేనని తేలిపోయింది. అప్పటిదాకా.. మోదీ వ్యూహాల గురించి, యుద్ధ పాటవాల గురించి సోషల్ మీడియాను హోరెత్తిస్తున్న బీజేపీ శ్రేణులు, వాట్సాప్ యూనివర్సిటీ సైతం ఒక్కసారిగా కంగుతిన్నాయి. ఈ పరిణామాన్ని ఎలా సమర్థించుకోవాలో తెలియక గందరగోళంలో పడ్డాయి.
‘ఇదంతా అబద్ధమైతే బాగుండు’ అని వాళ్లలో చాలా మంది తప్పక అనుకొని ఉంటారు. ఇక సోషల్ మీడియాలో బీజేపీ మద్దతుదారుల పరిస్థితి చెప్పడం వీలుకాదు. కొందరైతే.. పాకిస్థాన్ ప్రధాని వచ్చి మోదీ కాళ్లపై పడి ప్రాధేయపడుతున్నట్టు ఏఐతో ఫొటోలు సృష్టించి, పాక్ లొంగిపోయిందని ప్రచారం చేసేందుకు ప్రయత్నించారు. కానీ అవి ఫలించవని కొద్ది నిమిష్లాలోనే వారికి అర్థమైంది. ఎందుకంటే.. అసలు కాల్పుల విరమణ ఒప్పందం ఎందుకు జరిగింది? ఆ నిర్ణయం ఎలా తీసుకున్నారు? అనే విషయం ఎవరికీ అంతుబట్టని మిస్టరీగా మారింది. ‘అసలు ఎందుకు మొదలు పెట్టినట్టు? ఏం సాధించినట్టు? ఎందుకు ఆపినట్టు? ఇది దేశం పరువుకు భంగకరం కాదా?’ అని అనేకమంది అనలిస్టులు సోషల్ మీడియాలో నిలదీయడం మొదలు పెట్టారు. మరికొంతమంది లాల్‌బహదూర్ శాస్త్రి నేతృత్వంలో భారత సైనికులు 1965లో లాహోర్ వరకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. ఇందిరాగాంధీ 1971లో 13 రోజుల్లోనే పాక్‌తో యుద్ధాన్ని ముగించి బంగ్లాదేశ్‌ను వేరుచేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు. ఆనాడు ఇందిరాగాంధీ చేసిన ప్రసంగాన్ని ట్వీట్ చేయడం మొదలుపెట్టారు. మరికొంత మంది తూటా పేల్చకుండా, కేవలం సరిహద్దుల్లో సైన్యాన్ని నెలల తరబడి మోహరించడం ద్వారానే పాకిస్థాన్‌ను లొంగదీసుకున్న వాజపేయిని గుర్తు చేసుకున్నారు.
శనివారం ఉదయం నుంచే కొన్ని ఆశ్చర్యకర పరిణామాలు తెరమీదికి రావడం కనిపించింది. శుక్రవారం రాత్రి పాక్ వైమానిక స్థావరాలను భారీ ఎత్తున ధ్వంసం చేశామంటూ మొదటిసారి అధికారికంగా కొన్ని ఫోటోలు విడుదలయ్యాయి. మొదటిసారి జరిపిన దాడిలో ఏయే తీవ్రవాదులను తుదముట్టించారన్న వివరాలు పేర్లతో సహా నాలుగురోజుల తర్వాత శనివారమే బయటికి వచ్చాయి. మొత్తమ్మీద యుద్ధంలో పాకిస్థాన్‌పై మనం తిరుగులేని విజయం సాధిస్తున్నట్టు రుజువైంది. సైన్యం వీరోచితంగా పోరాడుతూ.. పాకిస్థాన్‌పై పైచేయి సాధిస్తున్న క్రమంలో మోదీ ప్రభుత్వం ఇలా ఎందుకు చేసిందన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. ‘నిజానికి పాకిస్థాన్ ఇప్పుడు చరిత్రలోనే ఎన్నడూ లేనంత బలహీనంగా ఉన్నది. దాని దగ్గర సరైన ఆయుధ సంపత్తి లేదు, ఆర్థిక బలమూ లేదు. అటు అఫ్గానిస్థాన్ సరిహద్దులో సమస్యలు ఎదుర్కొంటున్నది. ఇటు బలూచిస్తాన్‌లో సమస్యలు ఎదుర్కొంటున్నది. టర్కీ మినహా ఇతర ముస్లిం దేశాలు పెద్దగా సహకరించే పరిస్థితి కూడా లేదు.
అమెరికా-చైనా మధ్య ట్రేడ్ వార్ నేపథ్యంలో జియోపొలిటికల్ వాతావరణం కూడా పాక్‌ను లొంగదీసుకోవడానికి, మనం పైచేయి సాధించడానికి పూర్తి అనుకూలంగా ఉన్నది. అంతేకాకుండా ఇప్పుడు భారత సైన్యం అప్రతిహత విజయాలు సాధిస్తున్నది. పాకిస్థాన్‌కు సంబంధించిన ఒక్క క్షిపణి కూడా భారత్‌లోకి రాకుండా సైన్యం దుర్గం లాగా నిలబడింది. ఆర్మీ వీరోచిత పోరాటానికి దేశం మొత్తం జేజేలు పలుకుతున్నది. మొదటి దాడిలోనే ఉగ్రవాదులను మట్టుబెట్టింది, రెండో దాడిలో పాక్ సైనిక స్థావరాలపై దాడులు చేసింది. పాక్ దాడులకు వాడిన డ్రోన్లను ఎక్కడికక్కడి కూల్చిపారేసి, తన దుర్భేద్యమైన సైనికశక్తిని చాటుకున్నది. ఇలాంటి సమయంలో మోదీ ప్రభుత్వం కాల్పుల విరమణ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నదనేది మిస్టరీగా మారింది.
‘సైనిక బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఉంటే వాళ్లు పాకిస్థాన్‌ను లొంగదీసుకొనేవారు, మోదీ ప్రభుత్వం అలా చేయకపోవడం చారిత్రక తప్పిదం’ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పాక్ నుంచి బలూచిస్థాన్‌ను విడగొట్టడానికి ఇంతకుమించిన సమయం మరొకటి లేదు. పీవోకేను స్వాధీనం చేసుకోవడానికి కూడా ఇదే అనువైన సమయం. పాకిస్థాన్ అనే పీడను వదిలించుకోవాలని ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. దానికి శాశ్వతంగా గుణపాఠం చెప్పాలని భావించారు. ఇందుకోసం ఎదురయ్యే కష్టనష్టాలను ఎదుర్కొవడానికి కూడా ప్రజలు సిద్ధమై ఉన్నారు. అందుకే దేశంలోని ప్రతి రాజకీయ పక్షం మోదీ ప్రభుత్వం వెంట నడిచింది. మీరు యుద్ధం చేయండి, అన్ని రకాలుగా మద్దతు ఇస్తామని చెప్పాయి. త్రివిధ దళాలు పాక్ మీద ఎప్పుడెప్పుడు ప్రతీకారం తీర్చుకుందామా అని ఎదురుచూస్తున్నాయి. పాక్ దాడులను సమర్థంగా తిప్పికొడుతూనే.. ప్రతిదాడులతో తమ సత్తా చాటాయి. మూడు రోజుల్లోనే పాక్‌ను ఆత్మరక్షణలోకి నెట్టాయి. ఇంత అనువైన సమ యం ఉండగా మోదీ ప్రభుత్వం కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించిందన్నది అంతుపట్టడం లేదు.
విచిత్రం ఏమిటంటే కాల్పుల విరమణకు అంగీకరించినట్టు భారత్ నుంచి విస్పష్టమైన ప్రకటన రాగా.. పాకిస్థాన్ వైపు నుంచి మాత్రం కాల్పుల విరమణకు ఒప్పించినందుకు ట్రంప్‌కు పాక్ ప్రధాని, ఉప ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. ‘ఈ వ్యవహారం చూస్తుంటే పాకిస్థాన్‌కు అనుకూలంగా అమెరికా చక్రం తిప్పింది. ఆ ఒత్తిడికి మోదీ ప్రభుత్వం లొంగిపోయినట్టు అనిపిస్తున్నది’ అనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమయ్యాయి. వాస్తవానికి యుద్ధాన్ని ఎవరూ కోరుకోరు. కానీ.. ఒకవేళ యుద్ధం మొదలు పెడితే విజయం కోసమే కృషి చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు త్రివిధ దళాలకు స్వేచ్ఛ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ.. ఇప్పుడు మనకు చెప్పుకోదగ్గ విజయం కండ్లముందు కనిపించడం లేదు. పహల్గాం ఉగ్రదాడికి కారకులైనవారిని పాకిస్థాన్ మనకు అప్పగించిందా అంటే అదీ లేదు. ఉగ్రవాద సంస్థలను మూసేస్తామని ప్రకటించిందా అంటే అదీ జరగలేదు. మసూద్ అజర్ వంటి ఉగ్రవాదులు బహిరంగంగా తిరుగుతున్నా.. తమ దేశంలో ఉన్నారని పాక్ ఒప్పుకున్నదా? అంటే ఒప్పుకోలేదు. పాకిస్థాన్ నుంచి ఎలాంటి కమిట్మెంట్ రాకుండా కాల్పుల విరమణ ఎందుకు ఒప్పుకున్నట్టు? ఇలాంటి అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఒకవేళ బీజేపీ సోషల్‌మీడియా ప్రచారం చేస్తున్నట్టు భారత్ షరతులకు పాక్ తలొగ్గి ఉంటే.. వాటిని దేశ ప్రజల ముందు పెట్టాలి కదా? అని విపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.
Rajouri
మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని ప్రకటించిన తర్వాత కూడా సరిహద్దు వెంబడి పాకిస్థాన్ యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడింది. గత మూడు రోజుల్లో ఎన్నడూ లేనంత సంఖ్యలో డ్రోన్ల దండు ఐదు రాష్ర్టాల మీదికి దూసుకొచ్చాయి. ఇండియాటుడే, రిపబ్లిక్ టీవీ, ఇండియా టీవీ, ఎన్డీటీవీ తదితర అనేక టీవీ చానళ్లు ఇందుకు సంబంధించిన విజువల్స్‌ను కూడా చూపించాయి. ఒక డ్రోన్ ఏకంగా శ్రీనగర్‌లోని రాజ్‌బాగ్ వరకు, మరో డ్రోన్ గుజరాత్‌లోని కచ్ వరకు దూసుకొచ్చినట్టు వార్తలు వచ్చాయి. జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్వయంగా శ్రీనగర్‌లో కాల్పులు, పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయని.. ఇక కాల్పుల విరమణ ఒప్పందం ఎక్కడిదని ప్రశ్నించారు. అయినా కూడా మోదీ ప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకూ లేదు.
కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన జరగలేదని చెప్పుకోవడానికి మోదీ ప్రభు త్వం నానాతంటాలు పడింది. అయితే అనేక టీవీ చానళ్లు విజువల్స్‌తో సహా డ్రోన్ల వీడియోలు చూపిస్తుండటంతో.. ఒప్పందం ఉల్లంఘన జరిగిందని ఒప్పుకోక తప్పలేదు. మధ్యాహ్నం 5 గంటల నుంచి అమల్లోకి వచ్చిన ఒప్పందాన్ని.. గంటలు గడవకముందే పాకిస్థాన్ ఉల్లంఘించింది. కానీ.. ఉల్లంఘనల్ని ప్రతిఘటించాలని సైన్యాన్ని ఆదేశించామని చెప్పడం తప్ప, కాల్పుల విరమణ ఒప్పందం అమలు, భవిష్యత్తు కార్యాచరణపై మాత్రం మోదీ ప్రభుత్వం చెప్పలేదు. మరోవైపు పాకిస్థాన్.. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన వెంటనే ఆ విషయాన్ని చైనాకు చెప్పింది. చైనా ప్రభుత్వం ఏదేమైనా.. ఎటువంటి పరిస్థితుల్లో అయినా తమ మద్దతు పాకిస్థాన్‌కే ఉంటుందని ప్రకటించింది. మొత్తంగా మోదీ ప్రభుత్వం తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నదని, అనుమానాస్పదంగా ఉన్నదని, అది ఇలా ఎందుకు చేసిందో అంతుబట్టడం లేదని నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులు, రక్షణ రంగ నిపుణులు, టీవీ చర్చల్లో పాల్గొన్నవారు తలలు పట్టుకుంటున్నారు. నిన్నటివరకు ఇది మా యుద్ధం కాదు.. మాకు సంబంధం లేదు అని చెప్పిన అమెరికా ఎందుకు జోక్యం చేసుకున్నది. ‘దేశ సరిహద్దు రక్షణ విషయంలో, దేశ ప్రయోజనాల విషయంలో ఎవరినీ లెక్కబెట్టే సమస్యే లేదు, ఎవరి మాటా వినాల్సిన అవసరం లేదు’ అని గొప్పలు పోయిన బీజేపీ, మోదీ ఎందుకు అమెరికా చెప్పిన మరుక్షణమే కాల్పుల విరమణకు ఒప్పుకున్నది అనేది అంతుచిక్కని ప్రశ్నలుగా మిగిలిపోయాయి.
‘పాకిస్థాన్‌పై దాడికి ముందు బీజేపీ శ్రేణులు, మోదీ భక్తులు సోషల్ మీడియాలో, వాట్సాప్ యూనివర్సిటీలో చేసిన ప్రచారం అంతాఇంతా కాదు. ఈ సారి పాకిస్థాన్‌పై దాడి అంటూ జరిగితే.. బలూచిస్తాన్‌ను విడగొట్టడం ఖాయం! పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను మనం గుంజుకోవడం ఖాయం! పాకిస్థాన్ ముక్కలు చెక్కలు కావడం ఖాయం!’ అని ప్రచారం చేశారు. మరి ఇప్పుడు కనీసం పాకిస్థాన్ ఒక లొంగుబాటు ప్రకటనగానీ, శరణు వేడిన దాఖలాగానీ, కనీసం యుద్ధం వద్దని ప్రాధేయపడిన ఆనవాలుగానీ లేదు. అయినా కాల్పుల విరమణకు బీజేపీ ప్రభుత్వం ఎట్లా అంగీకరించిదని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నలు సంధించడం మొదలుపెట్టారు. ‘పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం ఏం జవాబు చెప్తుంది? అసలు దీనిని ఎందుకు మొదలు పెట్టినట్టు? ఎందుకు ఆపినట్టు?’ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ముఖ్యనేత కేసీ వేణుగోపాల్ అయితే ‘వియ్ మిస్ ఇందిర’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మరో సీనియర్ నేత జైరాం రమేశ్.. కాల్పుల విమరణకు మోదీ ప్రభుత్వం ఎందుకు అంగీకరించిందో పార్లమెంట్ సమావేశం పెట్టి, అఖిలపక్ష సమావేశం నిర్వహించి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విశ్వగురుగా ప్రకటించుకున్న మోదీ అమెరికా చెప్తే కాల్పుల విరమణకు ఎలా అంగీకరిస్తారని మరో సీనియర్ నాయకుడు నిలదీశారు. అసలు మనదేశం ఏం చేయాలో, ఏం చేయొద్దో చెప్పడానికి అమెరికా ఎవరనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. ఇంతలోనే ఐఎంఎఫ్ పాకిస్థాన్‌కు రూ.8 వేల కోట్ల బెయిల్ అవుట్ ప్యాకేజీ ప్రకటించినట్టు వార్తలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంత ప్రభావం ఉన్న మోదీ.. కేవలం 26 సభ్యదేశాలుగా ఉన్న ఐఎంఎఫ్‌ను పాకిస్థాన్‌కు రుణం ఇవ్వకుండా ఎందుకు అడ్డుకోలేకపోయారన్న అనుమానాలు అప్పుడే తలెత్తాయి. ఐఎంఎఫ్‌లో భారత్ కూడా సభ్య దేశమే. ఇంతలోనే అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ప్రకటన వెలువడటం, దేశానికి విస్మయం కలిగించింది.