Jaya Bachchan: సమాజ్‌వాదీ పార్టీ నాయకురాలు, ఎంపీ జయబచ్చన్ శుక్రవారం రాజ్యసభలో వీడ్కోలు ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు, తోటీ సభ్యులకు ఆమె క్షమాపణలు చెప్పారు. జయాబచ్చన్ సభలో మంగళవారం ఒకానొక సందర్భంలో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను ఎగతాళి చేస్తూ మాట్లాడారు. తన వీడ్కోలు ప్రసంగంలో ఆమె ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించి క్షమాపణ కోరారు.
రాజ్యసభలో ఆ రోజు తాను ప్రవర్తించిన తీరుకు రాజ్యసభ ఛైర్మన్ నొచ్చుకొని ఉంటే క్షమాపణలు తెలియజేస్తున్నాని జయాబచ్చన్ చెప్పారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘మీరు ఎందుకు ఆవేశపడతారని నన్ను చాలా మంది అడుగుతారు. అది నా తత్వం. నేను నా సహజమైన ప్రవర్తనను మార్చుకోలేను. నాకు కొన్ని విషయాలు నచ్చకపోతేనో, అంగీకరించలేకపోతేనో వెంటనే సహనం కోల్పోతాను’ అన్నారు.
తన ప్రవర్తన, మాటలతో ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే, తన మాటలను ఎవరైనా వ్యక్తిగతంగా తీసుకొని నొచ్చుకొని ఉంటే వారికి క్షమాపణలు తెలియజేస్తున్నానని జయాబచ్చన్ చెప్పారు. తనది క్షణికమైన ఆవేశం తప్పితే తనకు ఎవరినీ నొప్పించాలని ఉండదన్నారు.
ఇదిలావుంటే రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్న సభ్యుల సహకారం, ప్రేమను ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ గుర్తుచేసుకున్నారు. పెద్దల సభలో సదరు సభ్యుల ద్వారా పంచుకున్న జ్ఞానాన్ని తాను మిస్ అవుతానని అన్నారు. రిటైర్ అవుతున్న సభ్యుల వల్ల సభలో కొంత శూన్యత ఏర్పడుతుందని పేర్కొన్నారు.
మంగళవారం సభలో కాంగ్రెస్ సభ్యుడి ప్రశ్నను దాటవేసే క్రమంలో జయా బచ్చన్ నుంచి ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ఎదురుదాడిని ఎదుర్కొన్నారు. సభ్యులకు సమస్యను చెబితే అర్థం చేసుకోగలరని, వారేం చిన్న పిల్లలు కాదని ధన్‌ఖడ్ వ్యాఖ్యానించడంతో.. ఎంపీలను సభలో గౌరవంగా చూడాలని జయ వ్యాఖ్యానించారు.