న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లను అమలు చేయడానికి నియోజకవర్గాల పునర్విభజన ఎందుకు అవసరమని మంగళవారం ఒక కార్యకర్తల బృందం ప్రశ్నించింది. లోక్సభ, రాష్ట్ర శాసనసభల ప్రస్తుత సభ్యుల సంఖ్య ఆధారంగా దీనిని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. హక్కుల కార్యకర్త అంజలీ భరద్వాజ్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమన్ (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) కు చెందిన అన్నీ రాజా, న్యాయవాది ప్రశాంత్ భూషణ్, ఆర్థికవేత్త సంతోష్ మెహ్రోత్రా, సామాజిక కార్యకర్త భన్వర్ మేఘ్వంశీ, ప్రణాళికా సంఘం మాజీ సభ్యులు సైదా హమీద్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
మహిళా రిజర్వేషన్, పునర్విభజనలకు సంబంధించిన ప్రతిపాదిత బిల్లులపై విస్తృత సంప్రదింపులు జరపాలని, మహిళా ఉద్యమాల అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు పేరుతో ఆదరాబాదరగా మహిళలకు సాధికారత కల్పించడం సరైన విధానం కాదని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.