Canada Visa | జలంధర్, నవంబర్ 17 : భారతీయులకు జారీచేసే పర్యాటక వీసాల సంఖ్యను కెనడా భారీగా కుదించింది. గతంలో కెనడా పర్యాటక వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి 100 మంది భారతీయుల్లో దాదాపు 80 మందికి ఆ వీసాలు లభించేవి. కానీ, ఇప్పుడు ఆ సక్సెస్ రేటు 20% కంటే దిగువకు పడిపోయింది. ముఖ్యంగా పంజాబ్ నుంచి పర్యాటక వీసాల కోసం వచ్చే దరఖాస్తులను కెనడా పెద్ద సంఖ్యలో తిరస్కరిస్తున్నది. గత కొన్ని నెలల నుంచి ఈ ధోరణి కనిపిస్తున్నది. అర్హత గల దరఖాస్తుదారులకు ఇచ్చే 10 ఏండ్ల ఆటోమ్యాటిక్ మల్టిపుల్-ఎంట్రీ టూరిస్ట్ వీసాలను నిలిపివేయడానికి కొన్ని నెలల ముందు నుంచి కెనడా ఈ ధోరణిని అవలంబిస్తున్నది. తద్వారా పర్యాటకులకు తీవ్ర అడ్డంకులు సృష్టిస్తున్నది. కెనడా ఇమ్మిగ్రేషన్ విధానాలు గణనీయంగా కఠినతరం అవుతున్నట్టు ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవానికి న్యూఢిల్లీ-ఒట్టావా మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ ఈ ఏడాది ప్రథమార్థం (జనవరి-జూలై)లో భారతీయులకు కెనడా ఇమ్మిగ్రేషన్, శరణార్థి, పౌరసత్వ విభాగం ఐఆర్సీసీ (ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్షిప్ కెనడా)3,65,750 పర్యాటక వీసాలను జారీ చేసింది. ఇవి నిరుడు ఇదే సమయంలో మంజూరైన వీసాల కంటే 20,119 అధికం. కానీ, ఆ తర్వాత ఈ ధోరణి తల్లకిందులైంది. ఈ ఏడాది జూలై-ఆగస్టు నుంచి భారతీయుల వీసా సక్సెస్ రేటు గణనీయంగా దిగజారింది.
నిబంధనలు కఠినతరమవడంతో భారీగా ఆస్తులున్న సంపన్న కుటుంబాలతోపాటు అధిక వేతనాలు పొందే వృత్తి నిపుణులు, ప్రభుత్వ అధికారుల్లాంటి హై-ప్రొఫైల్ వ్యక్తుల నుంచి వచ్చే వీసా దరఖాస్తులను సైతం ఆర్థిక కారణాలతో తిరస్కరిస్తున్నారు. భారత్లో విలువైన ఆస్తులను కలిగి ఉండటంతోపాటు బ్యాంకులో పనిచేస్తూ అధిక వేతనాలను పొందుతున్న ఓ జంట కెనడాలో శాశ్వత నివాసిగా ఉంటున్న తమ కుమారుడిని సందర్శించేందుకు ఇటీవల చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, ఆర్థిక కారణాలతో వారి వీసా దరఖాస్తు సైతం తిరస్కరణకు గురైందని కెనడా ఇమ్మిగ్రేషన్ నిపుణుడు గురుప్రీత్ సింగ్ తెలిపారు.