sugar prices : దేశంలో చక్కెర ధరలు ఇటీవలి కాలంలో భారీగా పెరిగిపోతున్నాయి. నెల రోజుల్లో దాదాపు రూ.10 వరకు పెరిగినట్లు అంచనా. అయితే, చక్కెర ధరలు పెరగడానికి ఇథనాలే కారణమనే ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్రం స్పందించింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, చక్కెర ధరల పెంపునకు, ఇథనాల్‌కు సంబంధం లేదని కేంద్ర వినియోగదారులు వ్యవహారాలు, ఆహారం, సరఫరా శాఖ తెలిపింది.
ఈ మేరకు శుక్రవారం దీనిపై ఒక ప్రకటన చేసింది. ప్రస్తుతం దేశంలో చక్కెర ధరల పెరుగుదలకు గల కారణాలను వివరించింది. చక్కెర ఉత్పత్తి తగ్గిపోవడం, పండుగల సీజన్ కావడంతో డిమాండ్ భారీగా పెరగడం, వాతావరణ సమస్యల కారణంగా పంట నష్టపోవడం, అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థ కఠినంగా మారడం వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని కేంద్రం చెప్పింది. ఇథనాల్ ఉత్పత్తికి, చక్కెర ధరల పెరుగుదలకు సంబంధం లేదని స్పష్టం చేసింది. గత జూలై 20న కిలో చక్కెర ధర సగటున కేజీకి రూ.48.18 పైసలు ఉండగా, ప్రస్తుతం కేజీ ధర రూ.55.70గా ఉంది.
చక్కెరను ఇథనాల్ ఉత్పత్తికి తరలిస్తున్నారు అనే అంశంపై కూడా కేంద్రం వివరణ ఇచ్చింది. నిజానికి ఇటీవలి కాలంలో ఇథనాల్ కోసం చక్కెరను తగ్గించడం తగ్గిపోయిందని తెలిపింది. 2022-23లో 12 శాతం చక్కెరను తరలించగా, 2025-26లో 9 శాతం చక్కెరను తరలించామని వెల్లడించింది. దాదాపు మూడోవంతు ఇథనాల్‌ను మొక్కజొన్న వంటి పంటల నుంచి ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపింది. చక్కెర కొరత, ధరల పెరుగుదల వంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి చక్కెర నిల్వలపై పరిమితి విధించామని, అలాగే దిగుమతులపై పన్నులు తగ్గించాని కూడా పేర్కొంది. ఇదే సమయంలో అధికారులు స్టాక్ నిల్వలను తరచూ తనిఖీ చేయాల్సిందిగా ఆదేశించామని వివరించింది.