Farmer Protest | రైతుల ఛలో ఢిల్లీ పిలుపుతో దేశ రాజధాని సరిహద్దులను మూసివేశారు. నగరంలోకి రైతులను రానివ్వకుండా భారీగా బలగాలను మోహరించారు. అయితే, రైతుల నిరసనపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. కొత్త డిమాండ్లను ముందుకు తెచ్చిన నేపథ్యంలో రాష్ట్రాలతో చర్చించేందుకు సమయం కావాలన్నారు. రైతు నాయకులు వచ్చి ప్రభుత్వంతో చర్చలు జరపాలని సూచించారు. వ్యవసాయరంగాన్ని ప్రోత్సహించేందుకు, రైతుల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో అనేక చర్యలు తీసుకుందన్నారు.
రైతులు డిమాండ్ల నేపథ్యంలో ప్రభుత్వం సీనియర్ నాయకులను పంపి చర్చలు కొనసాగించిందన్నారు. నిన్న చండీగఢ్‌లో సమావేశం జరిగిందని.. ఇందులో చర్చిద్దామని చెబుతుండగానే రైతు నాయకులు లేచి వెళ్లిపోయారన్నారు. కొత్త డిమాండ్లు చేస్తే మరింత సమయం కావాలన్నారు. రాష్ట్రాలతో చర్చలకు సమయం కావాలి.. చర్చలను కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. డిమాండ్లు చాలా వరకు ఆమోదించబడ్డాయన్న ఆయన.. అయితే, కొత్త డిమాండ్లపై చర్చించేందుకు మరింత సమయం కావాలన్నారు. విధ్వంసం, హింసకు పాల్పడొద్దని ఆందోళనకారులను అభ్యర్థించారు. రైతు నాయకులు వచ్చి చర్చించాలని కోరుతున్నానన్నారు.