న్యూఢిల్లీ, జూన్ 12 : కర్ణాటక, ఏపీ మధ్య మామిడి పండ్ల రవాణాపై వివాదం ఏర్పడింది. కర్ణాటక నుంచి చిత్తూరు జిల్లాకు వచ్చే తోతాపురి మామిడిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు కర్ణాటక కాంగ్రెస్ సీఎం సిద్దరామయ్య లేఖ రాశారు. ఈ ఏడాది చిత్తూరు జిల్లాలో పెద్దఎత్తున మామిడి పండడంతో, సరైన ధర రావడం లేదని రైతులు పేర్కొంటున్నారు. దీనికి తోడు కర్ణాటక నుంచి కూడా తోతాపురి మామిడి భారీగాదిగుమతి కావడంతో ధర మరింత దిగజారే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో తోతాపురి మామిడి ఇతర రాష్ర్టాల నుంచి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించడాన్ని నిషేధిస్తూ జూన్ 7న ఆ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఏపీ ప్రభుత్వ చర్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సిద్దరామయ్య.. మామిడిపై నిషేధాన్ని ఆకస్మిక, ఏకపక్ష చర్యగా పేర్కొన్నారు. ఈ నిషేధం కర్ణాటక సరిహద్దులోని రైతులపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. చిత్తూరుకు చెందిన పల్ప్ ప్రాసెసింగ్, ఇతర మార్కెటింగ్ విధానాల ద్వారా అక్కడ తమ మామిడిని అమ్మడానికి రైతులు ఎన్నో ఏండ్లుగా ఆధారపడ్డారని, ఏపీ ప్రభుత్వ చర్య కారణంగా సరుకు రవాణా వ్యవస్థ దెబ్బతినడమే కాక, వేలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. ఈ నిషేధం సహకార సమాఖ్య సిద్ధాంతాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు.