పంజాబ్ కాంగ్రెస్ ఎంపీలతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి పంజాబ్ కాంగ్రెస్ ఎంపీలందరూ హాజరయ్యారు. తదుపరి పీసీసీ చీఫ్గా ఎవర్ని నియమిస్తే బాగుంటుందని సోనియా గాంధీ వీరిని అడిగినట్లు సమాచారం. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవం మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు తమ పదవులకు రాజీనామా చేయాలని సోనియా గాంధీ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తదుపరి పీసీసీ అధ్యక్షుల నియామకంపై కూడా సోనియా దృష్టి సారించారు. ఈ కోవలోనిదే పంజాబ్ ఎంపీలతో సోనియా సమావేశం కావడం.
పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సిద్దూపై పంజాబ్ కాంగ్రెస్ నేతల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయన వల్లే పార్టీ ఓటమి పాలైందని, ఆయన వ్యవహార శైలి ఏమాత్రం బాగోలేదని నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈసారి మాత్రం అలా జరగకూడదని, అందరికీ ఆమోదయోగ్యమైన నేత పీసీసీ పగ్గాలు చేపట్టాలని అధిష్ఠానం ఆలోచనగా చెబుతున్నారు.