న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ఇరాన్ యుద్ధాన్ని ముగించేందుకు మరింత మితవాదులు, మరింత హేతుబద్ధులు అయిన నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు ఈ వారం ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఇరాన్ దీన్ని ఖండించింది. దీంతో ఇరాన్లో ఇప్పుడు అధినాయకుడు ఎవరు అన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో అధికార పోరాటం నేపథ్యంలో శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డు కోర్(ఐఆర్జీసీ) పాలనా పగ్గాలను తన అధీనంలోకి తీసుకున్నట్లు ఇరాన్ ఇంటర్నేషనల్ వార్తాకథనం వెల్లడించింది. నిజానికి మితవాద నాయకుడిగా పేరున్న పెజెష్కియాన్‌ను రాజకీయంగా పూర్తిగా దూరం పెట్టినట్లు పరిస్థితి తెలియచేస్తున్నది. ఐఆర్జీసీ ఇప్పుడు కీలకమైన ప్రభుత్వ కార్యకలాపాలను తన అధీనంలోకి తీసుకున్నట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఇరాన్ ఇంటర్నేషనల్ పేర్కొన్నది.
మొజ్తబా ఎక్కడ?
అయతొల్లా అలీ ఖమేనీతోపాటు, పలువురు అగ్ర నాయకులు యుద్ధం ప్రారంభమైన తొలిరోజునే అంతం కావడంతో ఆ తర్వాత సుప్రీం నాయకత్వాన్ని చేపట్టిన ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ కనిపించక పోవడం పలు సందేహాలకు తావిస్తున్నది. సుప్రీం నాయకుడిగా ఎంపికైన అనంతరం ఒక్కసారి కూడా మొజ్తబా ప్రత్యక్షంగా కనిపించలేదు. ఆయన పంపిన సందేశాలను మాత్రం లైవ్ టీవీలో చదివి వినిపించారు. ఇది మొజ్తబా మరణించారన్న ఊహాగానాలకు దారితీసింది. అయితే సుప్రీం నాయకుడు కోమాలో ఉండవచ్చని తాజా వార్తలు సూచిస్తున్నాయి. మొజ్తబా విషమ పరిస్థితిలో ఉండవచ్చని ట్రంప్ పేర్కొనగా ఆయన శారీరక వైకల్యం పొంది ఉండవచ్చని అమెరికా రక్షణ మంత్రి పీటె హెగ్సెత్ స్పష్టం చేశారు. మొజ్తబా అదృశ్యం రాజకీయ శూన్యతను మిగిల్చింది. సాధారణ సైన్యం పరిధిలో స్వతంత్రగా పనిచేసే ఐఆర్జీసీ ఇప్పుడు పాలనను పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకున్నట్లు కనపడుతున్నది. వార్తా కథనం ప్రకారం సీనియర్ ఐఆర్జీసీ అధికారులతో కూడిన సైనిక మండలి ఇప్పుడు రోజువారీ నిర్ణయాలు తీసుకుంటున్నది. నిజానికి మొజ్తబా చుట్టూ పటిష్టమైన భద్రతా వలయాన్ని ఐఆర్జీసీ ఏర్పాటు చేసింది. దేశ పరిస్థితిపై ప్రభుత్వ నివేదికలు సైతం ఆయనకు చేరకుండా ఐఆర్జీసీ అడ్డుకుంటున్నట్లు ఇరాన్ ఇంటర్నేషనల్ తెలిపింది.
సంప్రదాయాలకు విరుద్ధంగా
యుద్ధం ప్రారంభమైన తొలినాళ్లలో మహ్మద్ పక్పోర్ మరణించడంతో ఆయన బాధ్యతలను వాహిదీ చేపట్టారు. అన్ని కీలక నాయకత్వ పదవుల ఎంపిక, నిర్వహణ బాధ్యతలు ఐఆర్జీసీ చూసుకుంటుందని వాహిదీ స్పష్టం చేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఇది గత సంప్రదాయాలకు విరుద్ధం. సుప్రీం నాయకుడి ఆమోదంతో నిఘా మంత్రులను అధ్యక్షులు గతంలో నియమించేవారు. గత వారం నుంచి ఐఆర్‌జీసీకి, అధ్యక్షుడికి మధ్య విభేదాలు ఏర్పడినట్లు వదంతులు వినవస్తున్నాయి. పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగిస్తూ ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచుతున్న ఐఆర్జీసీ ధోరణిపై పెజెష్కియాన్ అసంతృప్తి చెందినట్లు తెలుస్తున్నది. ఇది ఇరాన్ ఆర్థిక పరిస్థితిపై దీర్ఘకాల ప్రభావం చూపగలదని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. కాగా, ప్రస్తుత పరిస్థితిని కొన్ని వారాల క్రితమే నిపుణులు అంచనా వేశారు.