న్యూఢిల్లీ, జనవరి 9 : ఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పని చేయాలని, ఆదివారాలు సైతం కార్యాలయాలకు వెళ్లాలని ఎల్అండ్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఎల్అండ్టీ ఉద్యోగులతో ఇటీవల ఆన్లైన్లో సుబ్రహ్మణ్యన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంస్థలో వారానికి ఆరు రోజుల పని విధానాన్ని అమలు చేయడాన్ని ఓ ఉద్యోగి ప్రశ్నించారు. దీనికి సమాధానంగా.. ‘ఆదివారాలు కూడా మీతో పని చేయించలేకపోతున్నందుకు నేను బాధపడుతున్నాను. మీతో ఆదివారాలు సైతం పని చేయిస్తే చాలా సంతోషపడతాను. ఎందుకంటే, నేను ఆదివారాలు కూడా పని చేస్తున్నాను. ఎంత సేపు ఇంట్లో కూర్చుంటావు? ఎంతసేపు నీ భార్యను అలా తదేకంగా చూస్తూ ఉండగలవు? ఆఫీసుకు వెళ్లి పని చేయడం ప్రారంభించు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
సుబ్రహ్మణ్యన్ అంతటితో ఆగిపోలేదు. వారానికి 90 గంటలు పని చేయాలని సైతం ఆయన సెలవిచ్చారు. తాను ఒక చైనా వ్యక్తితో మాట్లాడానని, చైనా కార్మికులు వారానికి 90 గంటలు పని చేస్తారని, అమెరికన్లు 50 గంటలే పని చేస్తారు కాబట్టి కొన్ని రోజుల్లో అమెరికాను చైనా దాటేస్తుందని ఆ వ్యక్తి చెప్పినట్టు సుబ్రహ్మణ్యన్ చెప్పుకొచ్చారు. ‘మీరు కూడా ప్రపంచంలో ఉన్నత స్థాయిలో ఉండాలంటే వారానికి 90 గంటలు పని చేయాల్సిందే. ముందుకొచ్చి పని చేయండి’ అని ఆయన పిలుపునిచ్చారు. ఆయనపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఉద్యోగుల వ్యక్తిగత జీవితాలను చిన్నచూపు చూసేలా ఆయన మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు.