న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ఎవరన్న ఉత్కంఠకు సోమవారం తెరపడనుంది. బీజేపీ శాసనసభాపక్ష సమావేశం సోమవారం నిర్వహించనున్నట్టు సమాచారం. ఇందుకోసం ఇద్దరు పరిశీలకులను కూడా పార్టీ ఎంపికచేసినట్టు తెలిసింది. వీరిచ్చే నివేదిక ఆధారంగా ప్రధాని మోదీ నాయకత్వంలో జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశంలో సీఎం అభ్యర్థి పేరు ఖరారు అవుతుందని తెలిసింది.
మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై గెలుపొందిన పర్వేశ్ వర్మ సీఎం రేసులో ముందంజలో ఉన్నారు. ఢిల్లీ మేయర్‌గా పనిచేసిన రేఖా గుప్తా పేరు కూడా పార్టీ వర్గాల్లో ఎక్కువగా వినపడుతున్నది. ప్రస్తుత బీజేపీలో ఎవ్వరూ మహిళా సీఎం లేకపోవటం ఆమెకు కలిసివచ్చే అంశమని చెబుతున్నారు.
అలాగే..మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో మాదిరి..పాపులారిటీ పెద్దగా లేని ఎమ్మెల్యేని బీజేపీ అధిష్టానం ఎంపిక చేయవచ్చునని భావిస్తున్నారు. ఫిబ్రవరి 19 లేదా 20న ఢిల్లీ సర్కార్ ప్రమాణ స్వీకారం ఉంటుందని సమాచారం.