Tarigami : జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అదే సీన్ రీపీట్ అయ్యింది. ముస్లిం ఆధిపత్య ప్రాంతంలో కమ్యూనిస్టు జెండా మరోసారి రెపరెపలాడింది. కశ్మీర్‌లోని కుల్గామ్ స్థానంలో సీపీఎం అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ సీపీఎం అభ్యర్థి మహ్మద్ యూసుఫ్ తరిగామి (Mohammed Yousuf Tarigami) మరోసారి విజయం సాధించారు. ఇక్కడి నుంచి ఐదోసారి విజయం సాధించడం ద్వారా ఆయన రాజకీయంగా తనదైన ముద్ర వేశారు.
నిషేధిత జమాతే ఇస్లామీ (జేఈఐ) మద్దతుతో ఇస్లాం పేరుతో ఓట్లు అడిగిన సాయర్ అహ్మద్ రేషిపై తరిగామి 8,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కుల్గామ్‌లో అభ్యర్థిని నిలబెట్టని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) తరిగామికి మద్దతు ఇచ్చింది. అహ్మద్ రేషి రెండో స్థానంలో ఉండగా, పీడీపీ అభ్యర్థి మహ్మద్ అమీన్ దార్ మూడో స్థానంలో నిలిచారు. కాగా, దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్ స్థానం సీపీఎంకు కంచుకోటగా మారింది.
సీపీఎం పార్టీ సీనియర్ నేత మహ్మద్ యూసుఫ్ తరిగామి ఈ ప్రాంతంలో తనదైన రాజకీయ ముద్ర వేశారు. 1996 నుంచి నాలుగుసార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా ఐదోసారి కూడా కమ్యూనిస్ట్ జెండాను రెపరెపలాడించారు. తన గెలుపు ఇస్లాం ఓటమి కాదని ఆయన అన్నారు. అల్లర్లు, హింసకు పాల్పడిన జమాతే ఇస్లామీ దౌర్జన్యం, మోసపూరిత రాజకీయాలను ఇది బట్టబయలు చేసిందని విమర్శించారు.
కశ్మీర్ కోసం, కశ్మీర్ హక్కుల కోసం కుల్గామ్ ప్రజలు తన విజయానికి సహకరించారని అన్నారు. మరోవైపు 1979లో షేక్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనను అరెస్ట్ చేశారని మహ్మద్ యూసుఫ్ తరిగామి గుర్తుచేశారు. తన అరెస్ట్‌పై అబ్దుల్లాను మీడియా అడగ్గా ‘వో జో తరిగం వాలా’ అని అన్నారని, తన స్వస్థలం గురించి ఆయన ప్రస్తావించారని తెలిపారు.