హైదరాబాద్ : ఐఏఎస్ ఆఫీసర్ టీనా దాబి అంటే తెలియని వారుండరు.. ఎందుకంటే 2015 సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఆలిండియా టాపర్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. అంతే కాదు.. ఆమె ప్రేమ వివాహం కూడా ఓ రేంజ్లో జరిగింది. 2015 బ్యాచ్‌కు చెందిన అథార్ అమీర్ ఖాన్‌ను 2018లో పెళ్లి చేసుకుని, 2021లో విడిపోయింది. అలా టీనా దాబి ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తాజాగా ఇప్పుడు రాజస్థాన్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ప్రదీప్ గవాండేను పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించి, మరోసారి వార్తల్లో నిలిచింది. టీనా, ప్రదీప్ నిశ్చితార్థం ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
డిసెంబర్ 9, 1980న ప్రదీప్ గవాండే మహారాష్ట్రలో జన్మించారు. మహారాష్ట్రలోనే తన విద్యాభ్యాసం జరిగింది. స్థానికంగా ఉన్న ఎంబీబీసీ కాలేజీ నుంచి మెడిసిన్ కోర్సు పూర్తి చేశారు. కొన్నాళ్ల పాటు వైద్యుడిగా సేవలందించారు. 2013లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో పాసై ఐఏఎస్ జాబ్ సాధించాడు. ప్రస్తుతం ప్రదీప్ రాజస్థాన్‌లోని ఆర్కియాలజీ, మ్యూజియమ్స్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. టీనా దాబీ కూడా రాజస్థాన్‌లోనే తన సేవలను అందిస్తోంది. టీనా గతేడాది నవంబర్ 9న తన 28వ పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంది. ప్రదీప్, టీనా మధ్య వయసు తేడా 14 ఏండ్లు. వయసుతో సంబంధం లేకుండా వీరు ప్రేమలో పడ్డారు. ఈ ఏడాది ఏప్రిల్ 22న రాజస్థాన్‌లోని ప్రదీప్, టీనా వివాహం చేసుకోబోతున్నారు.