న్యూఢిల్లీ, జనవరి 21: వైట్ కాలర్ ఉద్యోగులకు పెద్ద ఉపద్రవం రాబోతున్నదని, అయితే దానిని ఎదుర్కోవడానికి ప్రభుత్వ ం సిద్ధంగా లేదని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ హెచ్చరించారు. జాబ్ మార్కెట్ రూపాన్ని కృత్రిమ మేధ (ఏఐ) ఊహించిన దానికన్నా వేగంగా మార్చేస్తున్నదని, దానికి సిద్ధం కావడానికి సమయం ముంచుకు వస్తున్నదని అన్నారు. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘రానున్న నాలుగైదు ఏండ్లలో అటు వైట్ కాలర్, ఇటు బ్లూ కలర్ వైపు కూడా ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఈక్విటీ సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుందని నేను నమ్ముతున్నాను’ అని అన్నారు. వ్యాధి పురోగతి కనుగొనడం దగ్గర నుంచి విద్య వరకు ఏఐ పురోగతి భేషుగ్గా ఉందని ఆయన అంగీకరించారు. సాఫ్ట్వేర్ అభివృద్ధిలో ఏఐ సాధనాలు ఇప్పటికే ఉత్పత్తిని ఎలా పెంచుతున్నాయో, లాజిస్టిక్స్, కాల్సెంటర్లలో తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను ఎలా భర్తీ చేస్తున్నాయో ఆయన ఎత్తి చూపారు. ఈ మార్పును పరిష్కరించకపోతే అసమానత మరింత పెరిగి సంపద, అవకాశాలు తక్కువ మంది చేతుల్లో కేంద్రీకృతమవుతాయని ఆయన హెచ్చరించారు. భవిష్యత్తులో శ్రామికశక్తి నియామక విధానాలు, ఆర్థిక న్యాయానికి అంతరాయం తీవ్రంగా ఉంటుందని గేట్స్ హెచ్చిరించారు.