లక్నో: భార్య, మూడేళ్ల కుమారుడితో కలిసి రైలు పట్టాల వద్ద ఒక వ్యక్తి రీల్ కోసం ప్రయత్నించాడు. మొబైల్లో వీడియో రికార్డ్ చేస్తుండగా వారిని రైలు ఢీకొట్టింది. (Couple, Son Hit By Train) దీంతో ఆ ముగ్గురు మరణించారు. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సీతాపూర్ జిల్లాలోని లాహర్పూర్కు చెందిన భార్యాభర్తలు తమ మూడేళ్ల కొడుకుతో కలిసి బుధవారం ఉదయం సోషల్ మీడియాలో రీల్ కోసం ప్రయత్నించారు. లఖింపూర్ ఖేరీలోని ఉమారియా గ్రామం సమీపంలో రైలు పట్టాల వద్ద మొబైల్లో వీడియో రికార్డ్ చేస్తుండగా రైలు వారిని ఢీకొట్టింది. దీంతో ఆ ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను 26 ఏళ్ల మహ్మద్ అహ్మద్, 24 ఏళ్ల భార్య నజ్నీన్, మూడేళ్ల కుమారుడు అబ్దుల్లాగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.