Crypto Currency | ముంబై, ఆగస్టు 10: మన దేశంలో క్రిప్టో కరెన్సీ లావాదేవీలు ఎక్కువగా జరిగే వజీర్ఎక్స్ సంస్థలోని ఖాతాదారులకు గత నెలలో పెద్ద షాక్ తగిలింది. పలు అంచెల భద్రత ఉన్నప్పటికీ పలువురు వాలెట్లు (ఖాతాల) నుంచి కోట్లాది రూపాయల డిజిటల్ కరెన్సీ వేరే ఖాతాల్లోకి తరలిపోయింది. దీంతో వారు లబోదిబోమంటూ విషయాన్ని వజీర్ఎక్స్ దృష్టికి తెచ్చారు. అయితే వారు అప్రమత్తమయ్యే లోపు రూ.2,000 కోట్ల(230 మిలియన్ డాలర్లు) డిజిటల్ ఆస్తులు దొంగతనానికి గురయ్యాయి. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ అతి పెద్ద క్రిప్టో కరెన్సీ చోరీ వెనుక నిందితుల కోసం నిఘా సంస్థలు దర్యాప్తును ముమ్మరం చేశాయి.
అసలెలా జరిగింది?
తొలుత ఒక వజీర్‌ఎక్స్‌లో ఒక వాలెట్‌ను తెరచిన సైబర్ చోరుడు దానిలోకి 230 మిలియన్ డాలర్లను వివిధ క్రిప్టో కరెన్సీ రూపాల్లోకి బదిలీ చేశాడు. అలాగే హవాలా నగదు బదిలీకి వినియోగించే టోర్నడో క్యాష్ నుంచి ఆ వ్యాలెట్‌కు ఒక లావాదేవీ ద్వారా నిధులు సమకూరినట్టు కనిపించింది. జూలై 10 నుంచి 18 వరకు వజీర్ ఎక్స్‌లోని వివిధ ఖాతాల నుంచి డిజిటల్ ఆస్తుల అపహరణ మొదలైంది. అలా అపహరించిన మొత్తాన్ని వివిధ క్రిప్టో కరెన్సీలలోకి మార్చి చిన్న చిన్న మొత్తాలలో రెండు వేరే ఎక్సేంజ్లలోని పలు ఖాతాలలోకి సదరు దొంగ బదిలీ చేశాడు. 2 వేల లావాదేవీలు జరిపి అపహరించిన మొత్తాన్ని ఖాతాల్లోకి పంపాడు.
దొంగ సొత్తు ఖర్చు పెట్టగలడా?
నిందితుడు ఇంతవరకు ఆ ఖాతాలలోని మొత్తాన్ని వినియోగించ లేదు. దీనిని వినియోగించుకోవాలంటే వాస్తవ ప్రపంచంలోకి వచ్చి దానిని డాలర్, రూపాయి వంటి కరెన్సీగా మార్చుకోవాల్సి ఉంటుందని, అప్పుడు అతని నిజ రూపం వెల్లడి కాక తప్పదని సైబర్ నిపుణులు అంటున్నారు. సైబర్ నేరగాడు ప్రస్తుతం 61,000 ఈథరమ్లు (ఒక్క ఈథరమ్ రూ.2 లక్షలకు పైగా విలువ చేస్తుంది) మూడు వ్యాలెట్లలో దాచి ఉంచినట్టు నిపుణులు కనుగొన్నారు. ఈ వ్యాలెట్లలో ఎలాంటి కదలికలు ఏర్పడినా అతడిని కనిపెట్టడానికి నిఘా సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. భారీ మొత్తం ఏదైనా ఉగ్రవాద సంస్థలకు నిధులను సమకూర్చడానికా? అనే కోణంలోనే దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి.